మార్పు మొదలైంది!
●
చిత్తూరు అర్బన్: ఒక మనిషి ప్రాణం ఎంతో విలువైంది. అతనిపై ఆధారపడి ఓ కుటుంబం ఉంటుంది. అలాంటి వారికి ఏదైనా జరిగితే జీవితంలో కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. కన్నతల్లిదండ్రులకు కర్భశోకం మిగులుతుంది. కట్టుకున్న భార్య, పిల్లలు వీధిన పడాల్సిన దుస్థితి దాపురిస్తోంది. ఇలాంటి పరిస్థితికి పుల్‌స్టాప్ పెట్టేందుకు పోలీస్ శాఖ నిర్ణయించింది. వాహనదారులకు హెల్మెట్ తప్పని సరి చేసింది. దీనిపై జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పిస్తోంది. దశల వారీగా కఠినంగా అమలు చేసేందుకు యత్నిస్తోంది. ఇందులో భాగంగానే నో హెల్మెట్.. నో పెట్రోల్..నినాదంతో ముందుకెళ్తోంది. తిరుపతి జిల్లాలో ఇప్పటికే హెల్మెట్ లేకుంటే ద్విచక్ర వాహనాలకు పెట్రోలు ఇవ్వడం లేదు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో సైతం పోలీసుశాఖ దీన్ని దశల వారీగా అమలు చేయడంతో పాటు వాహన చోదకుల్లో మార్పు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది.
మృత్యువాతపడుతున్నా..
‘బాబు, కొంచెం ఆలోచించండి.. హెల్మెట్లు పెట్టుకోండి. నీతోపాటు నీ కుటుంబ సభ్యుల ప్రాణాలు కూడా కాపాడినట్లవుతుంది. ఎందుకంటే నీ జీవితం నీ కుటుంబ సభ్యుల జీవనంపై ఆధారపడి ఉంది..’’ అంటూ పోలీసులు అవగాహన కల్పిస్తున్నా, వాహన చోదకుల్లో మార్పు రావడం లేదు. దీన్ని కొందరు ఏమాత్రం తలకెక్కించుకోవడం లేదు. హెల్మెట్లు ధరించకుండా ద్విచక్రవాహనాలు నడపొద్దని పదే పదే చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా చిత్తూరు జిల్లాలో గత మూడేళ్లలో 257 మంది మృత్యువాతపడ్డారు. చనిపోయినవాళ్లల్లో 40 శాతం మంది యువత ఉండడం గమనార్హం.
బాధ్యతగా ఫీల్ అవ్వండి
ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్లు ధరించాల్సిందే. ఇందులో ఎవ్వరికీ మినహాయింపు లేదు. జిల్లాలో చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో హెల్మెట్లు లేకుండా వాహనాలను లోపలకు అనుమతించడం లేదు. హెల్మెట్లు పెట్టుకుంటే ప్రమాదం జరిగినపుడు ప్రాణాలతో బయటపడొచ్చు. జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాకుండా ఇదో బాధ్యతగా ఫీల్ అవ్వండి. పోలీసుల కోసం కాదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా మా వాళ్లు అవగాహన కల్పిస్తున్నారు. వీలైనంత త్వరలోనే కలెక్టర్‌తో చర్చించి ‘నో హెల్మెట్–నో పెట్రోల్’ అమలు చేస్తాం.
– తుషార్ డూడీ, ఎస్పీ, చిత్తూరు
అసలు ద్విచక్రవాహనాలు నడిపేవాళ్లు ఎంత మంది హెల్మెట్లు వాడుతున్నారు..? ఎంత మంది వాడడం లేదు..? అనే విషయాలు తెలుసుకోవడానికి డ్రోన్లతో గుర్తిస్తున్నారు.
జరిమానాలే లక్ష్యంగా కాకుండా ప్రజల్లో తొలుత చైతన్యం తీసుకొచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రతి ఒక్కరూ వారి ప్రాణాలు రక్షించుకోవడానికి హెల్మెట్లు వాడాలనే స్వీయ ఆలోచనను తీసుకొస్తున్నారు.
హెల్మెట్లు పెట్టుకోని మైనర్లకు వాళ్ల తల్లిదండ్రుల ఎదుట కౌన్సెలింగ్, రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్లు పెట్టుకోకుండా మృతి చెందిన వాళ్లతో మాట్లాడించడం చేస్తున్నారు.
తుదిగా కలెక్టర్‌తో చర్చించి త్వరలోనే హెల్మెట్ లేకుంటే పెట్రోలు ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకోనున్నారు.
మార్పు మొదలైంది!


