స్కానింగ్‌! | - | Sakshi
Sakshi News home page

స్కానింగ్‌!

Dec 23 2025 7:27 AM | Updated on Dec 23 2025 7:27 AM

స్కానింగ్‌!

స్కానింగ్‌!

జిల్లాలో గుట్టుగా లింగనిర్ధారణ పరీక్షలు అబార్షన్లకు అడ్డాగా చిత్తూరు కేంద్రం మకాంమార్చిన అక్రమార్కులు నిద్రమత్తులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు

కన్నింగ్‌..

కాణిపాకం: జిల్లాలో పలు చోట్ల అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్‌ సెంటర్లు నిర్వహిస్తున్నారు. చిత్తూరు, యాదమరి, నగరి, కుప్పం వంటి ప్రాంతాల్లో ఇలాంటి స్కానింగ్‌ సెంటర్లు కుప్పలుతెప్పలుగా కొనసాగిస్తున్నారు. ఆయా స్కానింగ్‌ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ ఆడ, మగ అని తేల్చేస్తున్నారు. ఆపై అబార్షన్లకు రెఫర్లు చేసి కమీషన్లు గుంజుకుంటున్నారు.

వీరిని టచ్‌ చేసే ధైర్యముందా?

కలెక్టర్‌ మందలించినా!

అక్రమ స్కానింగ్‌ కట్టడికి చర్యలు చేపట్టాలని పలుమార్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కలెక్టర్‌ మందలించారు. డెకాయ్‌ ఆఫరేషన్‌ చేపట్టాలని, అందు కావాల్సిన ఖర్చులను కూడా భరిద్దామని సూచించారు. అయినా వైద్య శాఖ వెనకడగు వేస్తోంది. అక్రమ స్కానింగ్‌ సెంటర్ల రట్టు చేసే విషయంలో గుట్టుగా ఉంటోంది. డెమో విభాగం సైతం ముందడుగు వేయడం లేదు. తద్వారా అక్రమ స్కానింగ్‌ పుంజుకుంటోంది.

తమిళనాడులో కేసులు

అక్రమ స్కానింగ్‌, అబార్షన్లపై తమిళనాడు పోలీసులు స్పందిస్తున్నారు. అక్కడ కేసులు నమోదైతే వాటిని తక్షణమే అమలు చేసి అరెస్ట్లు, రిమాండ్‌కు పంపుతున్నారు. దీంతో తమిళనాడు వాసులు మకాం చిత్తూరు జిల్లాలో పెట్టారు. అక్కడి గర్భిణులను ఇక్కడకు తీసుకొచ్చి అబార్షన్లు చేయిస్తున్నారు. రెండో సంతానం ఆడ బిడ్డ ఉంటే వారిని టార్గెట్‌ చేస్తున్నారు. స్కానింగ్‌ చేయించి.. దగ్గరుండి అబార్షన్లు చేయించి పంపిస్తున్నారు. ఇందుకు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.20వేలు వసూలు చేస్తున్నారు. అబార్షన్లకు రూ.10వేలు గుంజుగుంటున్నారు. తద్వారా జిల్లాలో ఆడ పిల్లల నిష్ఫత్తి పూర్తిగా పడిపోతోంది.

ఆరు నెలల క్రితం చిత్తూరు నగరంలో స్వయంగా కలెక్టర్‌ రంగంలోకి దిగి అక్రమ స్కానింగ్‌ గుట్టును రట్టుచేశారు. దీనికి సంబంధించి 20 మందిపైగా కేసులు నమోదు చేయించారు. అందులో పలువురు ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. కానీ ఒకరిద్దరిపై మాత్రమే చర్యలు తీసుకుని మిగిలిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ కొంత మందిని వదిలి పెట్టిన కారణంగా వారు మకాం మార్చి చిత్తూరు కలెక్టరేట్‌కు సమీపంలో ఉన్న ప్రశాంత్‌నగర్‌లో గుట్టు స్కానింగ్‌ను నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం వైద్యారోగ్య శాఖలోని పలువురు అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

నగరి కేంద్రంలోని ఓ సెంటర్‌లో అక్రమ స్కానింగ్‌ నడిపిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. తమిళనాడు సరిహద్దు కావడంతో.. నగరిలో అక్రమ స్కానింగ్‌ సెంటర్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అక్కడి నుంచి అధిక సంఖ్యలో గర్భిణులు ఇక్కడికి వస్తున్నట్లు సమాచారం. గతేడాది అక్రమ స్కానింగ్‌ చేస్తూ...అబార్షన్లు చేయిస్తున్న ఓ మహిళను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యాదమరి మండల కేంద్రంలో కూడా ఓ ఆర్‌ఎంపీ డాక్టర్‌ అక్రమ స్కానింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే అబార్షన్లు చేయిస్తూ.. వేలకు వేలు ఫీజులు తీసుకుంటున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇందుకు కావాల్సిన మందులు, మాత్రలు స్థానికంగా లభ్యమవుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందింది. అదేవిధంగా కుప్పంలో కూడా అక్రమ స్కానింగ్‌ ఏళ్ల తరబడి నడుస్తున్నట్లు ప్రభుత్వ వైద్యులే చెబుతున్నారు. వారిని టచ్‌ చేస్తే.. బెదిరింపులు వస్తాయని భయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement