బంగారుపాళెం: మండలంలోని ఎద్దులవారిపల్లె దళితవాడలో గురువారం వైఎస్సార్‌సీపీ కార్యకర్త కుటుంబంపై టీడీపీ సానుభూతిపరులు దాడి చేశారు. గ్రామంలో పంచాయతీ తాగునీరు ఒకరోజు ఓ వైపు, మరో రోజు ఓ వైపు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం తాగునీటి కొళాయికి సంబంధించిన గేట్‌వాల్‌ను టీడీపీ కార్యకర్త గోవిందస్వామి కుమారుడు రంజిత్‌కుమార్, మరో పక్కకు తిప్పాడు. దాంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్త శ్రావణ్‌కుమార్ గేట్‌వాల్ ఎందుకు తిప్పావని రంజిత్‌కుమార్‌ను ప్రశ్నించాడు.
ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని దుర్భాషలాడుకున్నారు. నీటి కొళ్లాయి విషయంపై గురువారం ఉదయం మళ్లీ గోవిందస్వామి కుటుంబ సభ్యులు, శ్రావణ్‌కుమార్ కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. దీంతో గోవిందస్వామి, అతని భార్య నాగరాజమ్మ, అతని కుమారుడు రంజిత్‌కుమార్, బంధువు శివయ్య, చిలకమ్మ కలసి శ్రావణ్‌కుమార్, అతని భార్య స్వాతి, బంధువు సరితపై రాళ్లతో దాడి చేశారు. దీంతో శ్రావణ్‌కుమార్, స్వాతి, సరిత గాయపడ్డారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


