అంబేడ్కర్ జయంతిలో దళితులకు అవమానం
పూతలపట్టు (కాణిపాకం) : పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకలకు సొంత పార్టీ దళిత నేతలకే ఆహ్వానం దక్కలేదని టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి, నేషనల్ దళిత ఫోరం అధ్యక్షుడు ఆనగల్లు మునిరత్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. పూతలపట్టు మండల కేంద్రంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 40 ఏళ్లుగా పార్టీలకతీతంగా అంబేడ్కర్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలతో అధికార దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. జయంతి ఉత్సవాలకు ఏకపక్ష ధోరణితో రాజకీయం చేయడం తగదన్నారు. అధికారుల ద్వారా ప్రలోభాలు పెట్టి డ్వాక్రా మహిళలతోనే జయంతి ఉత్సవాలను చప్పగా ముగించడం కరెక్టు కాదని విరుచుకుపడ్డారు. ఏటా అన్ని పార్టీల కలయికతో జరిగే ఉత్సవాలకు ఈసారి పార్టీ రంగు వేశారని, ఇలా చేయడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
18న విద్యుత్ గ్రీవెన్స్
చిత్తూరు కార్పొరేషన్ : వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం విద్యుత్ గ్రీవెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని ట్రాన్స్‌కో ఈఈ మునిచంద్ర తెలిపారు. స్థానిక గాంధీ రోడ్డులోని ఈఈ కార్యాలయంలో చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల పరిధిలోని వినియోగదారులు సమస్యలు తెలపవచ్చన్నారు. సమస్యలను వినతి రూపంలో ఇవ్వాలని వివరించారు.
చూడ కార్యదర్శి బదిలీ
చిత్తూరు అర్బన్ : చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (చూడ )కార్యదర్శిగా పనిచేస్తున్న ఆర్. రమేష్ బాబును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న రమేష్ బాబును కడప మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ గా బదిలీ చేశారు.


