కుక్కలదాడిలో లేగ దూడ మృతి
పులిచెర్ల(కల్లూరు) : మండలంలోని ముల్లంగివారిపల్లెలో కుక్కల దాడికి లేగ దూడ మృతి చెందింది. కుక్కల బెడద ఎక్కువగా ఉండడంతో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని కుక్కల బెడద లేకుండా చూడాలని కోరుతున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడి మృతి
తవణంపల్లె : మండలంలోని కాణిపాకం రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందినట్లు తవణంపల్లె ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు ఇలా ...ఈనెల 10వ తేదీన మండలంలోని సరకల్లు హరిజనవాడకు చెందిన ఎ.కాళయ్య(64) కాణిపాకం దైవ దర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా కాణిపాకం రోడ్డులోని సీడీఎం కల్యాణ మండపం వద్ద గుర్తు తెలియని (నంబరు ప్లేటు లేని వాహనం) ద్విచక్ర వాహనం ఢీకొనడంతో బలమైన గాయాలయ్యాయి. 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించగా శనివారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
శ్రీరంగరాజపురం : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట సీఎస్‌ఐ స్కూల్ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు పట్టణం కట్టమించిలోని వినాయకగుడి వీధిలో షణ్ముగం (44) నివాసం ఉండేవారు. భార్య నాగవేణి తన పుట్టిల్లు అయిన ఒడ్డుపల్లెకు వెళ్లింది. దీంతో షణ్ముగం శుక్రవారం రాత్రి చిత్తూరు నుంచి ద్విచక్ర వాహనంలో అత్తగారింటికి వస్తుండగా 49 కొత్తపల్లిమిట్ట సీఎస్‌ఐ పాఠశాల వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడింది. తలకు తీవ్రగాయం కావడంతో స్థానికులు గుర్తించి 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి షణ్ముగం మృతి చెందినట్లు తెలిపారు. భార్య నాగవేణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుమన్ తెలిపారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 70,462 మంది స్వామిని దర్శించుకున్నారు. 25,393 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.01 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన వారికి సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళితే లోనికి అనుమతించరని స్పష్టం చేసింది.
కుక్కలదాడిలో లేగ దూడ మృతి


