
ప్రమాదానికి గురైన బైకు
చిత్తూరు కలెక్టరేట్ : సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపు నిర్ధారణ అయిన తరువాత ఎలాంటి సందేహాలు లేకపోతే సదరు వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలిపై సిరాతో మార్కు పెడతారు. ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేతికి చూపుడు వేలు లేకపోతే ఎలా అనే సందేహం వస్తుంది. ఇందుకు ఎన్నికల సంఘం ఒక నిర్దిష్టమైన విధానాన్ని రూపొందించింది. ఎడమ చేయి చూపుడు వేలు లేకపోతే మధ్యవేలుకు, అది కూడా లేకపోతే ఉంగరం వేలు, చిటికిన వేలు, బొటనవేలుకు సిరా చుక్క పెడతారు. ఒకవేళ ఎడమ చేయికి పూర్తిగా వేళ్లు లేకపోతే కుడి చేయి చూపుడు వేలు, అదీ లేకపోతే ఇతర వేళ్లకు సిరాగుర్తును పెడతారు. రెండు చేతులకు వేళ్లు లేకపోతే వేళ్ల మధ్య భాగంలో, ఎడమ చేయి పక్క భాగంలో ఇంకు గుర్తు స్పష్టంగా కనిపించేలా సిరా చుక్కను వేస్తారు.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైకు
గంగాధర నెల్లూరు: మండలంలోని సుందరరాజపురం వద్ద లారీ ట్యాంకర్‌ను ఓ యువకుడు బైక్‌పై వెళ్తూ ఢీకొట్టి మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. గంగాధరనెల్లూరు సీఐ శంకర్ కథనం మేరకు.. చిత్తూరు మండలం బంగారెడ్డిపల్లికి చెందిన దండుపాని కుమారుడు ఆర్య(16) అనే యువకుడు గురువారం ఉదయం సుమారు 5.45 గంటల ప్రాంతంలో ఎలక్ట్రిక్ బైక్‌పై చిత్తూరు నగరానికి వెళ్తుండగా అప్పటికే మంచు కారణంగా ఎదురుగా ఉండే వాహనం తెలియక రోడ్డు ఆగి ఉన్న పాల ట్యాంకర్ లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆర్యకు తీవ్ర రక్తస్రావం జరగడంతో వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడే డాక్టర్ పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారని తెలిపారు. ఆ యువకుడు మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఎంసీసీ ఉల్లంఘనలపై విచారణ
చిత్తూరు కలెక్టరేట్ : మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలపై సమగ్ర విచారణ చేసి నివేదికలు ఇస్తున్నట్లు జిల్లా ఎంసీసీ నోడల్ అధికారి మురళీకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో వివిధ సామాజిక మాధ్యమాలు, వార్తాపత్రికల్లో వచ్చిన 8 ఎంసీసీ ఉల్లంఘనలపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ఆయా ఆర్‌ఓల నుంచి నివేదికలు తెప్పించుకుని, వాటిని జిల్లా ఎన్నికల అధికారికి పంపించామన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న వాటిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు అమలు చేసేందుకు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
గంగజాతరకు అనుమతి తప్పనిసరి
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లావ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున గంగజాతర్లకు, ఊరేగింపులకు, ఇతర ఉత్సవాలకు ముందస్తుగా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. ముందస్తుగా ఎన్నికల అధికారి నుంచి అనుమతులు పొందాలన్నారు. అనుమతి లేకుండా నిర్వాహక కమిటీలు ఎటువంటి చాటింపులు కానీ, ప్రచారాలు కానీ చేయకూడదన్నారు. జిల్లాలో ఎక్కడైనా అలా చేస్తే ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమవుతుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి హెచ్చరించారు.
