● టీడీపీ పాలనలో చింతపండు వ్యాపారులపై వేధింపులు, కేసులు ● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక సమస్యలపై దృష్టి ● సీఎం, ఎంపీ కృషితో ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిన కేంద్రం ● మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు: చింతపండు వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన పుంగనూరులో శీతల గిడ్డంగులు నిర్మించడం ఎంతో అవసరమని, ఈ దిశగా వ్యాపారులకు కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి ముందుకురావాలని మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం చిత్తూరు రోడ్డులో ఎస్‌ఎస్‌బి కోల్డ్ స్టోరేజ్‌ను ఎంపీ రెడ్డెప్పతో కలసి మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. పుంగనూరులో చింతపండు తయారీ కుటీర పరిశ్రమగా సుమారు 20 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారన్నారు. చింతపండు వ్యాపారులు గత ప్రభుత్వంలో ట్యాక్స్‌లు చెల్లించలేక వీధిన పడ్డారన్నారు. చింతపండు వ్యాపారుల సమస్యలను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోకుండా, కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో దాడులు చేయించడమే కాకుండా కేసులు సైతం బనాయించి వేధించిందని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో చింతపండు వ్యాపారులు తమ సమస్యలను ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డికి నివేదించడంతో ఆయన ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారన్నారు. అప్పట్లో దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించి ప్రభుత్వం తరఫున కేంద్రానికి నివేదికలు పంపారన్నారు. అలాగే మిథున్‌రెడ్డి స్వయంగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌తో పలుమార్లు చింతపండు ట్యాక్స్ మినహాయింపు విషయమై చర్చించారన్నారు. తదనంతరం కేంద్ర ప్రభుత్వం చింతపండుకు ట్యాక్స్ లేకుండా ఉత్తర్వులు జారీ చేసిందని, ఎంపీ మిథున్‌రెడ్డి కృషితో చింతపండు వ్యాపారులకు విముక్తి లభించిందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కృషితో చింతపండు వ్యాపారులకు ట్యాక్స్‌ల మినహాయింపు, కమర్షియల్ ట్యాక్స్ అధికారుల వేధింపులు తప్పి వ్యాపారులు సంతోషంగా ఉన్నారన్నారు. చింతపండు వ్యాపారులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వారికి అండగా ఉండి, పరిష్కరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే శీతల గిడ్డంగులు, గోదాములు నిర్మించేందుకు ముందుకు వస్తే వారికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో కోల్డ్ స్టోరేజ్ యజమానులు డాక్టర్ శరణ్, హరిప్రసాద్, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము తదితరులు పాల్గొన్నారు.