Sakshi News home page

మీ అమ్మాయికి ధనపిశాచి పట్టిందని.. బెడ్‌రూంలో గుప్తనిధులు..!

Published Fri, Jul 21 2023 12:32 AM

- - Sakshi

చిత్తూరు: తమ కుమార్తెకు ఆరోగ్యం బాగోలేదని ఓ మందిరానికి వెళ్లిన తల్లిదండ్రులను ఏమార్చాడో మాంత్రికుడు. మీ అమ్మాయిని ఎక్కడకు తీసుకెళ్లినా రోగం నయంకాదన్నాడు. దీనికి కారణం మీ ఇంట్లో రూ.కోట్లు విలువజేసే వజ్రాలున్నాయన్నాడు. ధన పిశాచి మీ కూతురి ఒంట్లో చేరడంతో జబ్బున పడిందని పక్కాగా నమ్మించాడు. ఆపై బాధితులను ఏమార్చా కటకటాలపాలయ్యాడు. పలమనేరు అర్బన్‌ సీఐ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గంటావూరు కాలనీకి చెందిన సయ్యద్‌బాష కుమార్తెకు కొన్నాళ్లుగా ఆరోగ్యం బాగోలేదు.

గాలి సోకింటుందని ఎవరో చెప్పారని మదనపల్లి సమీపంలోని యాతాళవంక వద్ద దర్గాకు ఈనెల ఒకటో తేదీన తీసుకెళ్లారు. అక్కడ సయ్యద్‌బాష భార్యకు దూరపు బంధువైన అజీజ్‌ అలీ వారికి కనిపించి విచారించగా బిడ్డకు ఆరోగ్యం బాగోలేదని చెప్పారు. ఇవన్నీ కాదు తన స్నేహితుడున్నాడని అతనికి చూయిస్తే ఎలాంటి రోగాన్నైనా నయం చేస్తాడని తాము గంటావూరుకే వస్తామంటూ తెలిపాడు. దీంతో మదనపల్లెకు చెందిన రెడ్డి నరసింహులు, అజీజ్‌ అలీ వారింటికి వెళ్లి, వారికుమార్తెను పరిశీలించి ఇంట్లో భారీగా వజ్రాలున్నాయనియ ధన పిశాచి మీ కుమార్తెను పట్టుకుందని నమ్మించారు.

ఇందుకు విరుగుడుగా మంచి ముహూర్తం చూసి మీ ఇంట్లోని వజ్రాలను వెలికితీసి అందులోని ఓ వజ్రాన్ని మీ కుమార్తెకు ఉంగరంగా తొడగాలని చెప్పారు. దీంతో ఈనెల 18న అమావాస్య రోజు సయ్యద్‌బాష ఇంటిలోని బెడ్‌రూంలో గుప్తనిధులున్నాయని చెప్పిన చోట ఐదడుగులు గోతిని తీసి ఈ ఇద్దరూ పూజలు చేశారు. అక్కడ రెండు విలువైన వజ్రాలు లభించాయంటూ నకిలీవి సయ్యద్‌బాషాకు ఇచ్చారు. అతని నుంచి రూ.20 వేలు పూజా ఖర్చులకు తీసుకొన్నారు. ఇదే గోతిలో ఇంకా చాలా విలువైన వజ్రాలున్నాయని అతన్ని నమ్మించారు.

ఇందుకోసం ఇంకా చాలా ఖర్చు అవుతుందని చెప్పారు. అయితే ఇక్కడ జరుగుతున్న తతంగాలపై స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు నిఘా ఉంచారు. ఇదే సమయంలో తనకు దీనిపై అనుమానముందంటూ బాధితుడు పోలీసులను బుధవారం ఆశ్రయించాడు. గురువారం మళ్లీ గంటావూరులోకి ఇంటివద్దకు వచ్చిన అజీజ్‌, రెడ్డి నరసింహలును స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణలో నకిలీ వజ్రాలతో మోసం చేస్తున్నట్లు అంగీకరించారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి వారి మాయ మాటలను ప్రజలు నమ్మరాదని సీఐ చంద్రశేఖర్‌ హెచ్చరించారు.

Advertisement

What’s your opinion

Advertisement