ట్రాఫిక్‌ కష్టాలపై క్రిస్‌ గోపాలకృష్ణన్ ఆవేదన | Infosys Co-Founder Kris Gopalakrishnan Highlights Bengaluru Worsening Traffic Crisis, Post Sparks Debate Online | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ కష్టాలపై క్రిస్‌ గోపాలకృష్ణన్ ఆవేదన

Jul 7 2026 9:09 AM | Updated on Jul 7 2026 10:34 AM

Work From Home Demand Rises Amid Bengaluru Traffic Woes

భారత సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు నగరంలో ట్రాఫిక్‌ కష్టాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరినీ ఈ ట్రాఫిక్ నరకం వేధిస్తోంది. తాజాగా, ఐటీ దిగ్గజం ‘ఇన్ఫోసిస్’ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ బెంగళూరు నగర ట్రాఫిక్ దుస్థితిపై చర్చకు దారితీసింది.

కారణాలివే..

క్రిస్ గోపాలకృష్ణన్ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా నగరం అంతా ఎదుర్కొంటున్న సమస్యను పంచుకున్నారు. ‘బెంగళూరు సిటీలో కేవలం 31 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి నాకు ఈ రోజు దాదాపు రెండున్నర గంటల సమయం పట్టింది. రోజురోజుకూ పరిస్థితి మరింత దిగజారుతోంది. విపరీతమైన ట్రాఫిక్ రద్దీ, అధ్వాన్నమైన రోడ్ల పరిస్థితి, డ్రైవర్లలో క్రమశిక్షణ లేకపోవడమే దీనికి ప్రధాన కారణాలు’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఐటీ రంగానికి చెందిన ప్రముఖుడి నుంచే ఇలాంటి స్పందన రావడంతో బెంగళూరు ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వేలాది మంది ఉద్యోగులు, పౌరులు తమ ఆవేదనను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.

‘వర్క్ ఫ్రమ్ హోమ్’ డిమాండ్

గోపాలకృష్ణన్ పోస్ట్‌పై స్పందిస్తూ నెటిజన్లు తమ అనుభవాలను ఏకరువు పెడుతున్నారు. ఒక నెటిజన్ తనకు ఇటీవల 28 కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు మూడు గంటల సమయం పట్టిందని, బెంగళూరు ట్రాఫిక్ ప్రయాణం ఒక పీడకలగా మారిందని వాపోయారు. నగరంలో మౌలిక సదుపాయాలు మెరుగవుతాయనే నమ్మకం లేదని, అందువల్ల ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు మళ్లీ పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్లు ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు.

పరిష్కారాలు ఇవే..

ఈ దీర్ఘకాలిక సమస్యకు కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే సరిపోదని, ప్రయాణికులతో పాటు ప్రభుత్వం కూడా ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని నిపుణులు, పౌరులు కోరుతున్నారు. ఐటీ సంస్థలు తమ సిబ్బందిని వ్యక్తిగత వాహనాల్లో కాకుండా మెట్రో, బీఎంటీసీ బస్సు సర్వీసులను ఉపయోగించేలా ప్రోత్సహించాలని పౌరులు డిమాండ్ చేస్తున్నారు. నగరంలో ఏళ్ల తరబడి సాగుతున్న ఫ్లైఓవర్ పనులు, కొత్త మెట్రో కారిడార్ల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నారు. ఇవి పూర్తయితేనే కొంతవరకు ఉపశమనం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: కలెక్టర్ల జీతభత్యాల మాటేంటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement