మూన్‌ లైటింగ్‌ దుమారం : టెక్‌ దిగ్గజం విప్రో మరో కీలక నిర్ణయం

Wipro On Asked Employees To Be In Office At Least Three Days A Week - Sakshi

ఒకే సమయంలో రెండేసి ఉద్యోగాలు చేస్తున్న 300 మందిని తొలగించిన విప్రో.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 10 నుంచి సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఏదైనా మూడు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనంటూ ఉద్యోగులకు మెయిల్‌ పెట్టింది. అయితే విప్రో తీసుకున్న ఈ నిర్ణయంపై ఐటీ రంగ ఉద్యోగుల సంఘం (నైట్స్‌) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.  
  
విప్రో ఉద్యోగులకు పంపిన ఇ - మెయిల్స్‌లో..‘హైబ్రిడ్ పని విధానాన్ని కొనసాగిస్తూ ఉద్యోగులు మధ్య స్నేహ పూర్వకమైన వాతావరణాన్ని కల్పించే ఈ ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది’  

అంతేకాదు ‘మా రిటర్న్ టు ఆఫీస్ పాలసీలో సౌకర్యవంతమైన, హైబ్రిడ్ విధానాన్ని విప్రో అవలంభిస్తోంది. అక్టోబర్ 10 నుండి లీడర్‌షిప్ రోల్స్‌లో ఉన్న ఉద్యోగులు వారానికి మూడుసార్లు తిరిగి కార్యాలయాలకు రావాలి. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఆఫీసులు ఉద్యోగులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. 

చదవండి👉 ఐటీ సంస్థల్లో జీతాలు ఎక్కువగా ఉంటాయా? అది ఎంత వరకు నిజం!

ఈ నేపథ్యంలో ఆఫీసుకు రావాలంటూ ఉద్యోగులకు విప్రో పెట్టిన మెయిల్‌పై ఐటీ రంగ ఉద్యోగుల సంఘం నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయిస్‌ సెనేట్‌ (ఎన్‌ఐటీఈఎస్‌) ప్రెసిడెంట్‌ హర్‌ప్రీత్‌ సలూజ స్పందించారు. దేశీయ టెక్‌ సంస్థ ఉద్యోగులకు అకస్మాత్తుగా ఈ-మెయిల్‌ పంపింది. ‘కంపెనీ నెల క్రితమే  మెయిల్ పంపి ఉండాల్సింది. ఉద్యోగులకు కావాల్సిన ప్రాంతాలకు చేరుకునే వెసులుబాటు ఉండేది.  అలాగే, ఉద్యోగుల అనుమతి, వారి అభిప్రాయాలను కంపెనీ పరిగణనలోకి తీసుకోవాల్సిందని’ అన్నారు.

కొద్ది రోజుల క్రితం టీసీఎస్‌
గత సెప్టెంబర్‌లో మరో ఐటీ రంగ సంస్థ టీసీఎస్‌ ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలని చెప్పింది. రిటర్న్‌ టూ ఆఫీస్‌ పాలసీలో భాగంగా టీం లీడర్లు హెచ్‌ ఆర్‌ టీం విభాగంతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 

300 మందిపై వేటు
ఐటీ కంపెనీల్లో మూన్‌లైటింగ్‌ వివాదం దుమారం రేపుతోంది. ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేస్తున్న ఐటీ ఉద్యోగులకు కంపెనీలు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్కెట్‌లో తమ కాంపిటీటర్‌లతో కలిసి వర్క్‌ చేయడంపై విప్రో 300 మంది ఉద్యోగులపై వేటు వేసింది. విప్రోలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రత్యర్ధి కంపెనీల్లో సైతం పనిచేస్తుండడాన్ని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ  తీవ్రంగా తప్పుబట్టారు. ఈ తరుణంలో విప్రో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు స్వస్తి పలికి ఉద్యోగుల్ని ఆఫీసుకు రావాలని పిలుపునివ్వడంతో రెండేసి ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

చదవండి👉 పదోతరగతి కుర్రాడికి అమెరికా నుండి పిలుపు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top