
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది పెట్రోలియం మైనింగ్ లీజు (PML) బ్లాకుల్లో 172 ఆన్‌షోర్ బావులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. వీటి ద్వారా చమురు, గ్యాస్ ఉత్పత్తి కోసం రూ.8,110 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అడవులు, వాతావరణ మార్పులకు సంబంధించిన ఒక కమిటీ గత నెలలో జరిగిన సమావేశంలో ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి (EC) ఇవ్వడానికి సిఫార్సు చేసింది.
ఈ ఆన్‌షోర్ బావుల ఏర్పాటు కోసం పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (EMP)కు సంబంధించి మూలధన వ్యయం రూ.172 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది. ఏటా ఈఎంపీ రెన్యువల్ కోసం చేసే ఖర్చు రూ.91.16 కోట్లు ఉంటుందని చెప్పింది. కమిటీ బహిరంగ విచారణలో చేసిన హామీల కోసం రూ.11 కోట్లు కేటాయించనున్నట్లు పేర్కొంది. పర్యావరణ అనుమతిని సిఫార్సు చేస్తూ కమిటీ ఓఎన్‌జీసీని అన్ని పర్యావరణ పరిరక్షణ చర్యలు, భద్రతా ఏర్పాట్లను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.
మే నెలలో జారీ చేసిన ఎన్ఓసీ (NOC) ప్రకారం కోరింగా వన్యప్రాణుల అభయారణ్యం పర్యావరణ సున్నిత ప్రాంతం (eco-sensitive area) నుంచి 10 కి.మీ. లోపు ఏ బావిని కూడా ఏర్పాటు చేయరు. ముందస్తు అనుమతి లేకుండా అటవీ భూమి/ రక్షిత ప్రాంతంలో పైప్‌లైన్‌లు ఏర్పాటు చేయరు.
ఇదీ చదవండి: బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..