భారీగా బంగారం కొంటున్న భారత్.. కారణం ఇదే! | Why India Is Buying More Gold Than Ever, The Hidden Strategy Behind RBI’s Golden Reserves, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

భారీగా బంగారం కొంటున్న భారత్.. కారణం ఇదే!

Jul 7 2026 8:48 PM | Updated on Jul 8 2026 1:07 PM

Why Is India Buying So Much Gold Here is The Reason

బంగారం అంటే భారతీయులకు ఒకప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన నమ్మకం. ఇప్పుడు అదే నమ్మకం.. దేశ ఆర్థిక విధానంలో కూడా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరగడం, మరోవైపు రిజర్వ్ బ్యాంక్ వరుసగా బంగారం కొనుగోలు చేయడంతో మన దేశంలో బంగారం నిల్వల విలువ 115.8 బిలియన్ డాలర్లను చేరుకుంది. ఈ విలువ గత రెండేళ్లతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం విశేషం.

భారతదేశంలోని విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా గణనీయంగా పెరిగింది. గత ఆరు నెలల గణాంకాల ప్రకారం, విదేశీ నిల్వల్లో బంగారం వాటా 17 శాతానికి చేరుకుంది. ఏడాది క్రితం ఇది 12 శాతం మాత్రమే ఉండేది. అంటే.. భారత్ కేవలం డాలర్ వంటి విదేశీ కరెన్సీలపైనే మాత్రమే ఆధారపడకుండా, బంగారాన్ని కూడా ఒక కీలక ఆస్తిగా భావిస్తోందన్నమాట.

భారతదేశంలో బంగారం నిల్వల విలువ పెరగడానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడం. రెండు ఆర్‌బీఐ నిరంతరంగా బంగారం కొనుగోలు చేయడం. 2024 ప్రారంభంలో ఔన్స్ బంగారం ధర సుమారు 2,000 డాలర్ల వద్ద ఉండగా, తరువాత కాలంలో అది 4,000 డాలర్లకు పైగా చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వల విలువ ఒక్కసారిగా పెరిగింది.

భారత్ మాత్రమే కాకుండా, ప్రపంచంలోని చాలా దేశాల కేంద్ర బ్యాంకులు కూడా తమ నిల్వల్లో బంగారం వాటాను పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక ఆంక్షలు, కరెన్సీ విలువల్లో మార్పుల వచ్చినప్పుడు రక్షణ పొందేందుకు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా చూస్తున్నాయి. ఈ కారణంగా బంగారం నిల్వల విలువలను పెంచుకుంటున్నాయి.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తరువాత మారిన పరిస్థితి!
నిజానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కొన్ని దేశాలు తమ విదేశీ నిల్వలను కేవలం అమెరికా డాలర్ వంటి కరెన్సీల్లో ఉంచడం ఎంతవరకు సురక్షితం అనే దానిపై ఆలోచించడం ప్రారంభించాయి. దీంతో అనేక దేశాలు బంగారం కొనుగోళ్లను పెంచడం ప్రారంభించాయి.

బంగారం కొనుగోలు చేయడంలో పోలాండ్ ముందుంది. దీంతో కొన్ని సంవత్సరాల్లోనే.. తన బంగారం నిల్వలను భారీగా పెంచుకుంది. చైనా కూడా 2023 తర్వాత మళ్లీ బంగారం కొనుగోళ్లను వేగవంతం చేసింది. చెక్ రిపబ్లిక్ వంటి చిన్న దేశాలు కూడా తమ బంగారం నిల్వలను గణనీయంగా పెంచుకున్నాయి.

ఆర్‌బీఐ వ్యూహం
ఇండియా కూడా గత కొన్నేళ్లుగా బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంటోంది. 2015లో ఆర్‌బీఐ వద్ద సుమారు 557.8 టన్నుల బంగారం ఉండేది. అది 2026 నాటికి అది 880.5 టన్నులకు చేరింది. ముఖ్యంగా 2019 తర్వాత ఆర్‌బీఐ మరింత బంగారం కొనుగోలు చేయడం ప్రారంభించింది. దీంతో దేశ విదేశీ నిల్వల్లో బంగారం ప్రాధాన్యత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పుడు బంగారం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని కేంద్ర బ్యాంకులు భావిస్తున్నాయి.

ఇక అమెరికా, జర్మనీ, ఇటలీ, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం నిల్వలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఇటీవల కాలంలో కొత్తగా.. పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేయాల్సిన అవసరం ఈ దేశాలకు తక్కువగా ఉంది. సౌదీ అరేబియా కూడా తన బంగారం నిల్వలను దాదాపు స్థిరంగా ఉంచుకుంది. అయితే చమురు ఎగుమతుల ద్వారా వచ్చే విదేశీ కరెన్సీ నిల్వలపై ఎక్కువగా ఆధారపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement