ఈ వారం మార్కెట్‌ ఎలా ఉండబోతుంది?

Weekly Stock Market Update - Sakshi

ముంబై: కేంద్ర బడ్జెట్‌ – 2023 ప్రభావిత అంశాలు, ఆర్‌బీఐ పాలసీ సమావేశ నిర్ణయాలు ఈ వారం స్టాక్‌ మార్కెట్‌కు దిశానిర్ధేశం చేస్తాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. వచ్చే నెల ఒకటిన జరిగే బడ్జెట్‌ కార్యక్రమంతో పాటు జనవరి వాహన విక్రయ గణాంకాలు, అదే నెలకు సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడికానున్నాయి. అదే రోజున ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్యపాలసీ నిర్ణయాలు వెల్లడికానున్నాయి.

ప్రైవేట్‌ రంగ దిగ్గజం అదానీ గ్రూప్‌పై అమెరికా హెడ్జ్‌ ఫండ్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణల పరిమాణాలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. వీటితో పాటు దేశీయ కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తీరుతెన్నులు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలను ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయి.  

ట్రేడింగ్‌ నాలుగు రోజులే జరిగిన గతవారంలో సెన్సెక్స్‌ 1291 పాయింట్లు, నిఫ్టీ 17,604 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. అదానీ గ్రూప్‌ అవకతవకలపై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక, ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ ముగింపు, దేశీయ అతిపెద్ద ఎఫ్‌పీఓ(ఆదానీ ఎంటర్‌ప్రైజస్‌) ప్రారంభం, టీ1 సెటిల్‌మెంట్‌ అమల్లోకి రావడం, బడ్జెట్‌ ముందు అప్రమత్తత తదితర పరిణామాలు ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫైనాన్స్, ఇంధన, మెటల్, మౌలిక షేర్లలో అమ్మకాలు నెలకొన్నాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, టెక్నాలజీ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. 

‘‘యూనియన్‌ బడ్జెట్, యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్యపాలసీ నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు కొనసాగొచ్చు. ఇటీవల పతనంతో భాగంగా దిగివచ్చిన నాణ్యమైన షేర్లను గుర్తించి ఎంపిక చేసుకోవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్‌ ఒత్తిడికి లోనవుతున్నందున, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించాలి. గత నాలుగు వారాలుగా నిఫ్టీకి కీలక మద్దతుగా ఉన్న 17,800 స్థాయి కోల్పోంది. దిగువ స్థాయిలో 17,470 – 17,420 శ్రేణి తక్షణ మద్దతుగా ఉంది. బడ్జెట్‌లో మార్కెట్‌ అనుకూలంగా నిర్ణయాలు వెలువడితే ఎగువ స్థాయిలో 17,800–18,200 శ్రేణిని చేధించే వీలుంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top