
డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 154 శాతం దూసుకెళ్లి రూ. 3,483 కోట్లను తాకింది. ఉత్పత్తి వ్యయాలు తగ్గడం, అమ్మకాల పరిమాణం పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 1,369 కోట్లు ఆర్జించింది.
మొత్తం ఆదాయం సైతం రూ. 36,093 కోట్ల నుంచి రూ. 41,216 కోట్లకు జంప్ చేసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి వేదాంతా నికర లాభం భారీ వృద్ధితో రూ. 14,988 కోట్లకు చేరింది. 2023–24లో కేవలం రూ. 4,239 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 1,46,988 కోట్ల నుంచి రూ. 1,56,643 కోట్లకు ఎగసింది.
2025 మార్చి 31 కల్లా స్థూల రుణ భారం రూ. 73,853 కోట్లుగా నమోదైంది. మరోసారి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అరుణ్ మిశ్రాను బోర్డు ఎంపిక చేసినట్లు వేదాంతా పేర్కొంది. వివిధ బిజినెస్‌లను ప్రత్యేక కంపెనీలుగా విడదీసే ప్రణాళికలను సెప్టెంబర్ చివరికల్లా పూర్తిచేయనున్నట్లు వేదాంతా సీఎఫ్‌వో అజయ్ గోయెల్ తాజాగా వెల్లడించారు.