
భారత ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాలు వివిధ రంగాలలో ఆందోళనలను రేకెత్తించాయి. ఆంక్షల కారణంగా సుమారు 3,00,000 ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణుల అంచనా.
అమెరికా విధించిన సుంకాల ప్రభావం చాలా వరకు వస్త్ర పరిశ్రమ, రత్నాల పరిశ్రమలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ రంగాల్లో పనిచేస్తున్న లక్షలమంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అయితే.. ఎగుమతులు తగ్గినప్పటికీ.. దేశంలో డిమాండ్ ఉంటుందని, అమెరికా సుంకాలు భారత ఆర్ధిక వ్యవస్థ మీద పెద్దగా ప్రభావం చూపవని మరికొందరు చెబుతున్నారు.
వస్త్ర, రత్నాల రంగాలను పక్కన పెడితే.. ఐటీ సర్వీస్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ) కూడా అమెరికా సుంకాల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. ఆటో విడిభాల సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు కూడా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని జీనియస్ హెచ్‌ఆర్‌టెక్ వ్యవస్థాపకులు & సీఎండీ ఆర్‌పీ యాదవ్ అన్నారు.
భారతదేశం వస్త్రాలను, రత్నాభరణాలను ఎక్కువగా అమెరికాకు ఎగుమతి చేస్తోంది. అయితే టారీఫ్స్ పెరగడం వల్ల ఇప్పుడు ఇది ప్రశ్నార్థకంగా మారింది. సుంకాలు పెరగడం వల్ల.. ధరలు పెరుగుతాయి. దీనివల్ల మార్కెట్‌లో అమ్మకాలు గణనీయంగా తగ్గుతాయి. అయితే మన దేశం ప్రత్యామ్నాయంగా వేరే దేశాలకు ఎగుమతి చేసుకోవడం ద్వారా.. నష్టాన్ని ఆపవచ్చు.
ఇదీ చదవండి: బంగారం, వెండి & బిట్‌కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
అమెరికాకు భారతదేశం ఎగుమతులు 87 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇది జీడీపీలో కేవలం 2.2 శాతం మాత్రమే. ఫార్మా, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక పరిశ్రమలు ప్రస్తుతానికి ప్రభావితం కాలేదు. భారత్ తన ఎగుమతులను ఇతర దేశాలకు మళ్లించగలదని టీమ్‌లీజ్ సర్వీసెస్‌లో ఎస్వీపీ బాలసుబ్రమణియన్ అనంత నారాయణన్ పేర్కొన్నారు.