
ఈ నెలలోనే 6 కంపెనీల పబ్లిక్ ఆఫర్లు
ఈ వారంలో రెండు.. వచ్చే వారం నాలుగు
మొత్తం రూ.11,669 కోట్ల సమీకరణకు రెడీ
న్యూఢిల్లీ: గత కొద్ది నెలలుగా కళతప్పిన ప్రైమరీ మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి మొదలైంది. 2025లో అడపాదడపా వస్తున్న పబ్లిక్ ఇష్యూలు ఇకపై జోరందుకోనున్నాయి. ఈ నెలాఖరులోగా ఆరు కంపెనీలు స్టాక్ మార్కెట్ తలుపుతట్టనున్నాయి. మొత్తం మీద వచ్చే పది రోజుల్లో రూ.11,669 కోట్లు సమీకరించేందుకు రంగం సిద్ధమైంది. టెక్స్‌టైల్ కంపెనీ బొరానా వీవ్స్ నేడు (20న) ప్రారంభమై 22న ముగుస్తుంది.
ఇక పుణేకు చెందిన ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ బెల్‌రైజ్ ఇండస్ట్రీస్ ఇష్యూ 21న ఆరంభమై 23న క్లోజవుతుంది. మిగిలిన నాలుగు కంపెనీలు వచ్చే వారంలో పబ్లిక్ ఆఫర్ చేపట్టనున్నాయి. లీలా ప్యాలెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్‌కు చెందిన స్లోస్ బెంగళూరు లిమిటెడ్, ఏజిస్ వోప్యాక్ టెరి్మనల్స్, అరిస్‌ఇన్‌ఫ్రా సొల్యూషన్స్, స్కోడా ట్యూబ్స్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ వారంలోనే ఈ నాలుగూ ప్రైస్ బ్యాండ్‌లను ప్రకటించనున్నాయి.
ధరల శ్రేణి ఇలా...
బొరానా వీవ్స్ రూ.144 కోట్ల సమీకరణ కోసం చేపడుతున్న పబ్లిక్ ఇష్యూకి రూ. 205–216 ధరల శ్రేణి (ప్రైస్ బ్యాండ్) ప్రకటించింది. బెల్‌రైజ్ ఇండస్ట్రీస్ ఈ ఇష్యూ ద్వారా రూ.2,150 కోట్లు సమీకరిస్తోంది. దీనికి ధరల శ్రేణి రూ. 85–90గా నిర్ణయించింది.
స్లోస్ బెంగళూరు రూ.3,000 కోట్ల తాజా ఈక్విటీతో పాటు ఓఎఫ్‌ఎస్ ద్వారా రూ.2,000 కోట్ల ప్రమోటర్ షేర్లను కూడా విక్రయించనుంది. ఏజిస్ లాజిస్టిక్స్ అనుబంధ సంస్థ ఏజిస్ వోప్యాక్ టెర్మినల్స్ తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.3,500 కోట్లు సమీకరించనుంది. ఇక నిర్మాణ రంగ మెటీరియల్ సరఫరాదారు ఆరిస్‌ఇన్‌ఫ్రా సొల్యూషన్స్ రూ.600 కోట్లు, స్కోడా ట్యూబ్స్ రూ.275 కోట్లు సమీకరించే అవకాశం ఉంది.
ఇప్పటిదాకా 10...: ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు ట్రంప్ టారిఫ్ వార్ దెబ్బకు ఈ ఏడాది మార్కెట్లో తీవ్ర అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో మన సూచీలు ఆల్‌టైమ్ గరిష్టం నుంచి దాదాపు 17 శాతం మేర దిద్దుబాటుకు గురయ్యాయి. ఈ ప్రభావంతో కంపెనీలు ఐపీఓలకు ముఖం చాటేశాయి. 2024లో రికార్డు స్థాయిలో 91 పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1,6 లక్షల కోట్లు సమీకరించగలిగాయి.
రిటైల్ ఇన్వెస్టర్లు కూడా పొలోమంటూ వచి్చన ఇష్యూకల్లా సబ్‌స్క్రయిబ్ చేయడంతో ప్రైమరీ మార్కెట్ కళకళలాడింది. అయితే, 2025లో ఇప్పటిదాకా కేవలం 10 కంపెనీలు మాత్రమే ఐపీఓలకు వచ్చాయి. కాగా, టారిఫ్ యుద్ధానికి ట్రంప్ 90 రోజుల విరామం ప్రకటించడం.. ట్రేడ్ డీల్స్‌పై జోరుగా చర్చలు జరుగుతుండటంతో మార్కెట్లు మళ్లీ తాజా కనిష్టాల నుంచి బాగానే బౌన్స్ అయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్‌టైమ్ గరిష్టానికి మరో 4 శాతం దూరంలోనే ఉన్నాయి.
సెకండరీ మార్కెట్ దన్నుతో ఐపీఓలకు కంపెనీలు మళ్లీ ముందుకొస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, సెబీ నుంచి దాదాపు 57 కంపెనీలకు ఐపీఓల కోసం దాదాపు లైన్ క్లియర్ కాగా.. మరో 74 కంపెనీల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని యాక్సిస్ క్యాపిటల్ వెల్లడించింది. ఇందులో సోలార్/పునరుత్పాదక ఇంధనం నుంచి కో–వర్కింగ్ స్పేస్, ఫార్మా, హెల్త్‌కేర్, తయారీ, కెమికల్స్, రియల్టీ తదితర రంగాలకు చెందిన సంస్థలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఇష్యూగా నిలిచిన ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఏథర్ ఎనర్జీ దాదాపు రూ.3,000 కోట్లు సమీకరించడం విదితమే. అయితే, పేలవంగా లిస్టయ్యి.. ఇప్పటికీ ఇష్యూ ధర (రూ.321) కంటే దిగువనే ఉండటం గమనార్హం.
కోల్ ఇండియా సబ్సిడరీలు కూడా..
ప్రభుత్వరంగ బొగ్గు దిగ్గజం కోల్ ఇండియాకు చెందిన రెండు అనుబంధ సంస్థలు.. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్), సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంపీడీఐ) ఐపీఓకు సన్నద్ధమవుతున్నాయి. ఈ రెండూ త్వరలోనే సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేయనున్నట్లు కోల్ ఇండియా డైరెక్టర్ దేబశిష్ నందా వెల్లడించారు. బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లను నియమించుకున్నామని, మార్కెట్ పరిస్థితులను బట్టి ఇష్యూ ఉంటుందని చెప్పారు. కోల్ ఇండియాకు 7 సబ్సిడరీలు ఉండగా. దేశీ బొగ్గు ఉత్పత్తిలో 80% వాటా దీని చేతిలోనే ఉంది.