రష్యా-ఉక్రెయిన్ ఎఫెక్ట్.. స్వదేశీ కంపెనీ మెడ మీద వేలాడుతున్న కత్తి..!

Ukraine War Threatens Cancellation of Bharti-Backed OneWeb Satellite Launch - Sakshi

రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇంకా దాడులు కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే, ఆ దాడుల ప్రభావం ఇప్పుడు ఇతర రంగాల మీద కూడా పడుతుంది. ఈ దాడుల వల్ల లో ఎర్త్ ఆర్బిట్(లియో) బ్రాడ్ బ్యాండ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వన్ వెబ్ దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. రష్యా 24 టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యన్ అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ అధిపతి డిమిత్రి రోగోజిన్ మాట్లాడుతూ.. వన్ వెబ్ తన ఉపగ్రహాలను సైనిక అవసరాల కోసం ఉపయోగించబోమని హామీ ఇవ్వకపోతే, మార్చి 4న దాని ఉపగ్రహ ప్రయోగాన్ని నిలిపి వేయనున్నట్లు తెలిపారు. ఈ వన్ వెబ్ కంపెనీలో ఎయిర్‌టెల్‌కు చెందిన భారతి గ్లోబల్ గ్రూప్‌కు ఎక్కువ వాటా ఉంది. 

కజకస్తాన్ నుంచి రష్యా అద్దెకు తీసుకున్న బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి 36 ఉపగ్రహాలను మార్చి 4న ప్రయోగించడానికి వన్ వెబ్ ప్రణాళికలు వేసింది. అయితే, మార్చి 4న మాస్కో సమయం 21:30 వరకు వన్ వెబ్ సైనిక అవసరాల కోసం ఉపయోగించబోమని హామీ ఇవ్వకపోతే ఉపగ్రహాలను ప్రయోగించడానికి వినియోగిస్తున్న సోయుజ్-2.1బీ అంతరిక్ష వాహన నౌక వాడకాన్ని అంతరిక్ష సంస్థ అనుమతించదని రోగోజిన్ తెలిపారు. తన ఉపగ్రహాలను రష్యాకు వ్యతిరేకంగా సైనిక అవసరాల కోసం ఉపయోగించబోమని వన్ వెబ్ హామీలను అందించాలని తన ఏజెన్సీ కోరుకుంటున్నట్లు రోగోజిన్ తెలిపినట్లు ఇంటర్ ఫ్యాక్స్ వార్తా సంస్థ నివేదించింది.

నవంబర్ 2020లో దివాలా అంచున ఉన్న వన్ వెబ్ కంపెనీలో యుకె ప్రభుత్వం, భారతి గ్లోబల్ కన్సార్టియం కలిసి 650 లియో ఉపగ్రహాల ద్వారా బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ సేవలను అందించడానికి సంస్థలో 1 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టుబడి పెట్టాయి. వన్ వెబ్ ఇప్పటికే 400కు పైగా ఉపగ్రహలను కక్ష్యలో ప్రవేశ పెట్టింది. ఉపగ్రహ ప్రయోగాన్ని రద్దు చేస్తే రష్యా-ఉక్రెయిన్ దాడి వల్ల ప్రత్యక్ష పర్యవసానాన్ని ఎదుర్కొన్న మొదటి భారతీయ కార్పొరేట్ కంపెనీగా భారతి గ్రూప్ నిలవనుంది. గత ఏడాది జూన్ నెలలో అతిపెద్ద వాటాదారుగా మారడానికి వన్ వెబ్ సంస్థలో అదనంగా 500 మిలియన్ డాలర్లు(రూ.3,700 కోట్లకు పైగా) పెట్టుబడి పెట్టనున్నట్లు భారతి గ్రూప్ తెలిపింది. $550 మిలియన్ పెట్టుబడితో వన్ వెబ్'లో భారతి గ్రూప్ 38.6 శాతం వాటా కలిగి ఉంది. యుకె ప్రభుత్వం, యూటెల్శాట్, సాఫ్ట్ బ్యాంక్ ఒక్కొక్కటి 19.3 శాతం వాటా కలిగి ఉన్నట్లు వన్ వెబ్ ఒక ప్రకటనలో తెలిపింది.

(చదవండి: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధర..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top