ఇళ్ల అమ్మకాల్లో 5 శాతం పెరుగుదల | Sakshi
Sakshi News home page

ఇళ్ల అమ్మకాల్లో 5 శాతం పెరుగుదల

Published Fri, Jan 5 2024 12:43 AM

TS: hyderabad records historic high residential sales in 2023 Knight Frank India - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో గతేడాది ఇళ్ల విక్రయాలు (అన్నిరకాల విభాగాలు) మొత్తం మీద 5 శాతం పెరిగాయి. 3,29,907 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇది పదేళ్ల గరిష్ట స్థాయి. మధ్యస్థ, ప్రీమియం విభాగంలో ఇళ్లకు నెలకొన్న డిమాండ్‌ అమ్మకాల్లో వృద్ధికి దారి తీసింది. అయితే రూ.50 లక్షల్లోపు బడ్జెట్‌ ఇళ్ల అమ్మకాలు (అందుబాటు ధరల) అంతక్రితం ఏడాదితో పోలిస్తే 16 శాతం తగ్గాయి.

97,983 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. 2022లో ఈ విభాగంలో అమ్మకాలు 1,17,131 యూనిట్లుగా ఉన్నాయి. రూ.50 లక్షల్లోపు ఇళ్ల సరఫరా (కొత్త వాటి నిర్మాణం) గతేడాది 20 శాతం తగ్గింది. ఇది కూడా విక్రయాలు తగ్గేందుకు ఒక కారణం. మొత్తం ఇళ్ల అమ్మకాల్లో అందుబాటు ధరల ఇళ్ల వాటా 37 శాతం నుంచి 30 శాతానికి పరిమితమైంది. ఈ వివరాలను నైట్‌ఫ్రాంక్‌ ఇండియా విడుదల చేసింది. రూ.కోటిపైన ఖరీదైన ఇళ్ల అమ్మకాలు 2022లో 27 శాతం పెరగ్గా, 2023లో 34 శాతం వృద్ధిని చూశాయి. 

అమ్మకాల గణాంకాలు..
► హైదరాబాద్‌ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు మొత్తం మీద గతేడాది 6 శాతం పెరిగి 32,880 యూనిట్లుగా ఉన్నాయి. 2022లో 31,406 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. 
► ముంబైలో అందుబాటు ధరల ఇళ్ల అమ్మకాలు (రూ.50లక్షల్లోపు) 6 శాతం తగ్గి 39,093 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు 2 శాతం పెరిగి 86,871 యూనిట్లకు చేరాయి. 
► బెంగళూరులోనూ అందుబాటు ధరల ఇళ్లు 46 శాతం క్షీణించి 8,141 యూనిట్లకు పరిమితమయ్యాయి. అన్ని విభాగాల్లోనూ ఇళ్ల అమ్మకాలు ఒక శాతం పెరిగి 54,046 యూనిట్లుగా ఉన్నాయి.  
► ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు 3 శాతం పెరిగి 60,002 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్కడ అందుబాటు ధరల ఇళ్ల విక్రయాలు 44 శాతం తగ్గాయి. 7,487 యూనిట్లు అమ్ముడయ్యాయి.   
► పుణెలో ఇళ్ల అమ్మకాలు 13 శాతం వృద్ధితో 49,266 యూనిట్లకు చేరాయి.  
► చెన్నైలో 5 శాతం అధికంగా 14,920 ఇళ్లు అమ్ముడయ్యాయి.  
► కోల్‌కతాలో 16 శాతం అధికంగా 14,999 ఇళ్ల యూనిట్ల విక్రయాలు జరిగాయి.

 ఖరీదైన ఇళ్లకు ఆదరణ
ఇళ్ల విక్రయాల పరంగా 2023 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దేశ బలమైన ఆర్థిక మూలాల నేపథ్యంలో దీర్ఘకాల పెట్టుబడుల విషయమై ఇన్వెస్టర్లలో నమ్మకం నెలకొంటోంది. ఇళ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ, గడిచిన దశాబ్ద కాలంలో ఇళ్ల కొనుగోలు సామర్థ్యం పెరిగింది. అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో కొంత ఒత్తిడి నెలకొంది.  ఇది విక్రయాల్లో ప్రతిఫలిస్తోంది.  –ఎండీ శిశిర్‌బైజాల్‌ ,నైట్‌ఫ్రాంక్‌ ఇండియా చైర్మన్‌

బలమైన పనితీరు 
వడ్డీ రేట్లు పెరగడం, నిర్మాణ వ్యయాలు పెరగడం, అంతర్జాతీయ అనిశి్చతులు, ఇళ్ల ధరలు పెరుగుదల వంటి ఆరంభ సవాళ్లు గతేడాది ఉన్నప్పటికీ, రియల్‌ ఎస్టేట్‌ రంగం అసాధారణ పనితీరు చూపించింది. కరోనా సమయంలో నిలిచిన డిమాండ్‌ కూడా తోడు కావడంతో ప్రాపర్టీ మార్కెట్‌ అసాధారణ స్థాయికి చేరుకుంది. 2023 ఏప్రిల్‌ నుంచి వడ్డీ రేట్ల పెంపును ఆర్‌బీఐ నిలిపివేయడం కూడా కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని పెంచింది. కొనుగోలుదారుల్లో సానుకూల ధోరణితో మధ్యస్థ ప్రీమియం, ఖరీదైన ఇళ్లకు బలమైన డిమాండ్‌ను తీసుకొచ్చింది. ధరలు పెరగడంతో బడ్జెట్‌ ఇళ్ల (అఫర్డబుల్‌) విభాగం సవాళ్లను ఎదుర్కొంటోంది. –వికాస్‌ వాధ్వాన్, ప్రాప్‌టైగర్‌ గ్రూప్‌ సీఎఫ్‌వో

హైదరాబాద్‌లో ఇళ్లకు భలే గిరాకీ
హైదరాబాద్‌: రియల్‌ ఎస్టేట్‌కు హైదరాబాద్‌ ప్రముఖ మార్కెట్‌గా వృద్ధి చెందుతోంది. 2023 సంవత్సరానికి ఇళ్ల అమ్మకాల పరంగా దేశంలో హైదరాబాద్‌ రెండో అతిపెద్ద వృద్ధి మార్కెట్‌గా నిలిచింది. 2022 సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు 49 శాతం పెరిగాయి. 2022లో హైదరాబాద్‌లో 35,372 ఇళ్ల యూనిట్లు అమ్ముడు పోగా, 2023లో 52,571 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. అహ్మదాబాద్‌ తర్వాత అమ్మకాల్లో ఎక్కువ వృద్ధి హైదరాబాద్‌లోనే నమోదైంది.

2023 చివరి త్రైమాసికంలో హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు 20,491 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు జూలై–సెపె్టంబర్‌ త్రైమాసికంలో అమ్మకాలు 14,191 యూనిట్లతో పోలిస్తే 44 శాతం వృద్ధి నమోదైంది. 2022 చివరి త్రైమాసికం విక్రయాలు 10,335 యూనిట్లతో పోలిస్తే రెట్టింపైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ మార్కెట్లో నూతన ఇళ్ల సరఫరా 2023లో అంతక్రితం ఏడాదితో పోలిస్తే 7 శాతం తగ్గింది. 2022లో 82,801 యూనిట్లు సరఫరాలోకి రాగా, 2023లో 76,819 యూనిట్లు ప్రారంభం అయ్యాయి.

ఈ వివరాలను ప్రముఖ ఆన్‌లైన్‌ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాలకు సంబంధించిన వివరాలతో వార్షిక నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్‌ సహా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో గతేడాది 4.10 లక్షల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 33% వృద్ధి నమోదైంది.

Advertisement
 
Advertisement
 
Advertisement