
బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ రద్దీ(Traffic Crisis)ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా స్థానికంగా ఉన్న విప్రో క్యాంపస్ ద్వారా పరిమిత వాహనాల రాకపోకలను అనుమతించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ(Azim Premji)ని కోరారు. ఈ చర్య వల్ల రహదారి ప్రక్కనే ఉన్న ప్రాంతాల్లో రద్దీ దాదాపు 30 శాతం తగ్గుతుందని అధికారులు తెలిపారు.
ముఖ్యంగా కార్యాలయాల ప్రారంభ, ముగింపు సమయాల్లో దేశవ్యాప్తంగా నగరాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. బెంగళూరులో అయితే ట్రాఫిక్ సమస్య మరీ ఎక్కువ. దీన్ని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు స్థానికంగా ఉన్న విప్రో క్యాంపస్ నుంచి వాహనాలను అనుమతించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కంపెనీ వ్యవస్థాపకులు అజీమ్ ప్రేమ్‌జీకి లేఖ రాశారు. ప్రజా వాహనాలను విప్రో క్యాంపస్ నుంచి అనుమతిస్తే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు గణనీయమైన ఉపశమనం కలుగుతుందని అందులో పేర్కొన్నారు.
ఇటీవల లాజిస్టిక్స్ టెక్నాలజీ సంస్థ బ్లాక్ బక్ సహ వ్యవస్థాపకుడు తమ బెల్లందూర్ కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నట్లు ప్రకటించారు. బ్లాక్ బక్ సీఈఓ రాజేష్ యాబాజీ సోషల్ మీడియాలో తెలిపిన వివరాల ప్రకారం..‘రోడ్లపై ట్రాఫిక్, గుంతలు, దుమ్ముతో చాలా ఇబ్బంది కలుగుతుంది. దాంతో బెల్లందూర్‌లోని కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నాం’ అంటూ రాసుకొచ్చారు. ఈ వ్యాఖ్యల తరువాత నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ అడ్డంకుల గురించి ఆందోళనలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది.
ఇదీ చదవండి: వర్షంలో ఫుడ్ ఆర్డర్ చేస్తే ‘రెయిన్ ఫీజు’పై జీఎస్టీ