
టిమ్ కుక్ (Tim Cook)కు వచ్చే ఏడాదికి 65 ఏళ్లు నిండుతాయి. 2011లో యాపిల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఈయన కంపెనీ నుంచి నిష్క్రమించిన తరువాత.. అతని స్థానంలో ఎవరు రావచ్చనే దానిపై ఇప్పటికే చర్చ మొదలైపోయింది. టెక్ ప్రపంచంలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న పెద్ద ప్రశ్న ఇదే!.
గత కొన్ని సంవత్సరాలుగా.. యాపిల్ కంపెనీ నుంచి ఎంతోమంది ఉన్నత స్థాయి ఉద్యోగులు వైదొలిగారు. ఈ జాబితాలో డిజైన్ చీఫ్ జోనీ ఐవ్, రిటైల్ హెడ్ ఏంజెలా అహ్రెండ్ట్స్, సీఎఫ్ఓ లూకా మాస్ట్రీ, సీఓఓ జెఫ్ విలియమ్స్ ఉన్నారు. వీరు కంపెనీ నుంచి వైదొలిగినప్పుడు ఇంత పెద్ద చర్చ జరగలేదు. కానీ టిమ్ కుక్ నిష్క్రమణ తప్పకుండా చర్చనీయాంశమే. ఎందుకంటే.. ఆయన స్థానాన్ని పొందే వ్యక్తి యాపిక్ సంస్థలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. అంతటి వ్యక్తి 'జాన్ టర్నస్' అని వినిపిస్తోంది.
జాన్ టర్నస్.. యాపిల్ కంపెనీలో హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్. ఆయన దాదాపు 24 సంవత్సరాలుగా యాపిల్‌లో ఉంటూ.. కీలక పదవులను చేపట్టారు. ఈయన వ్యూహాలు కూడా హార్డ్‌వేర్ పాత్రకు మించి ఉంటాయి. ప్రస్తుతం ఈయన వయసు 50 ఏళ్లు. యాపిల్ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నప్పుడు టిక్ కుక్ వయసు 50 సంవత్సరాలే.
ఇదీ చదవండి: ముకేశ్ అంబానీ పర్సులో ఎంత డబ్బు ఉంటుందో తెలుసా?
జాన్ టర్నస్‌కు టిమ్ కుక్ దగ్గర మంచి పేరు ఉంది. ఈయన యాపిల్ మొట్టమొదటి కొత్త ఐఫోన్ ఫారమ్ ఫ్యాక్టర్ అయిన ఐఫోన్ ఎయిర్‌ను పరిచయం చేశారు. ఈయన ఐఫోన్ 17 లాంచ్ సందర్భంగా లండన్‌లోని యాపిల్ రీజెంట్ స్ట్రీట్ స్టోర్‌లో కస్టమర్లను కూడా పలకరించారు. ఇలాంటి కారణాల వల్ల కుక్ స్వయంగా అతన్ని ఎక్కువగా విశ్వసిస్తారని సన్నిహిత వర్గాలు చెబుతాయి. అయితే సీఈఓ బాధ్యతల నుంచి వైదొలిగే అంశం గురించి టిమ్ కుక్ ఇప్పటివరకు ఎలాంటి ప్రస్తావన చేయలేదు.