
ఈసారి 12% వరకు టారిఫ్‌లు అప్
డేటా వినియోగం ఆధారంగా బహుళ స్థాయిల్లో పెంపు
ఈ ఏడాది ఆఖరు నాటికి అమలు
టెలికం యూజర్లు పెరుగుతున్న నేపథ్యంలో టెల్కోలు మరో విడత చార్జీల వడ్డనకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ఆఖరు నాటికి 10–12 శాతం మేర పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యస్తంగాను, అధిక మొత్తంలోను చెల్లించే వర్గాలు టార్గెట్‌గా ఈ పెంపు ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది జూలైలోనే బేస్ ప్లాన్లను 11–23 శాతం పెంచేసినందున, ఈసారి వాటి జోలికెళ్లకుండా డేటా అ్రస్తాన్ని వాడుకోవాలనే యోచనలో కంపెనీలు ఉన్నట్లు పేర్కొన్నాయి. బేస్ ప్లాన్లను మళ్లీ పెంచితే యూజర్లు.. ప్రత్యర్థి కంపెనీకి మారిపోయే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణం.
కాబట్టి ఈసారి డేటా ప్రయోజనాలను తగ్గించేసి, మరింత ఖరీదైన ప్లాన్ల వైపు మళ్లించేలా ఈ విడత పెంపు ఉండబోతోందని సంబంధిత వర్గాలు వివరించాయి. డేటా వినియోగం, డేటా స్పీడ్ లేదా డేటాను అత్యధికంగా వినియోగించే వేళలకు వర్తించే విధంగా ఈ పెంపు ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. టారిఫ్‌ల స్వరూపం మారాల్సిన అవసరం ఉందంటూ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా టాప్ మేనేజ్‌మెంట్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా చార్జీల పెంపు వార్తలకు ఊతమిస్తున్నాయి. అందరికీ ఒకే రకం టారిఫ్‌ను వర్తింపచేయడమనేది సరి కాదంటూ ఎయిర్‌టెల్ ఎండీ గోపాల్ విఠల్ ఈ మధ్య వ్యాఖ్యానించారు. ఇటు
వినియోగదారులు, అటు కస్టమర్లు బండిల్డ్ ప్లాన్లకు అప్‌గ్రేడ్ కావడం వల్ల దేశీ టెలికం పరిశ్రమ ఆదాయ వృద్ధి 2025–27 ఆర్థిక సంవత్సరాల్లో రెండంకెల స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు బీఎన్‌పీ పారిబా ఒక నివేదికలో తెలిపింది.
యాక్టివ్ యూజర్ల వృద్ధి..
మే నెలలో యాక్టివ్ యూజర్ల సంఖ్య 29 నెలల గరిష్టమైన 74 లక్షలకు ఎగియడంతో మొత్తం యాక్టివ్ యూజర్ల సంఖ్య 108 కోట్లకు చేరింది. దీనితో వరుసగా అయిదు నెలల పాటు కొత్త యూజర్ల సంఖ్య పెరిగినట్లయింది. మే నెలలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కొత్త యూజర్ల సంఖ్య 55 లక్షలు పెరిగింది. దీంతో జియో యాక్టివ్ యూజర్ల సంఖ్య 150 బేసిస్ పాయింట్లు (సుమారు 1.5 శాతం) పెరిగి, పరిశ్రమవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ యూజర్లలో వాటా 53 శాతానికి చేరింది. అటు భారతి ఎయిర్‌టెల్ కొత్త యూజర్ల సంఖ్య 13 లక్షలు పెరిగింది.
మొత్తం యాక్టివ్ యూజర్లలో ఎయిర్‌టెల్ వాటా 36 శాతానికి పెరిగింది. రాబోయే రోజుల్లో 5జీ సేవల విస్తరణ, వినియోగం ఆధారంగా కొత్త కనెక్షన్లు ఉంటాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. జియోలాంటి టాప్ ఆపరేటర్ల యూజర్లు పెరగడమనేది భవిష్యత్తులో టారిఫ్‌ల పెంపునకు సానుకూల పరిస్థితులున్నట్లుగా కనిపిస్తోందని బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ పేర్కొంది. వొడాఫోన్ ఐడియా యూజర్లు తగ్గిపోయే కొద్దీ ఎయిర్‌టెల్, జియోల మా ర్కెట్ వాటా మరింతగా పెరుగుతుందని తెలిపింది. – సాక్షి, బిజినెస్‌డెస్క్