అనురాగం మాటున తగ్గనున్న పన్నుభారం

Tax Saving Strategies That Reduce Your Tax Liability - Sakshi

పన్ను చెల్లించే ప్రతి వ్యక్తి పన్ను భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం సహజం. పన్ను భారం తగ్గించు కోవడం చట్ట రీత్యా నేరం కాదు. ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలు చూసుకుని ప్లాన్‌ చేసుకోవచ్చు. ప్లానింగ్‌లో ఒక అవకాశం కుటుంబ సభ్యుల దగ్గర ఉంది. అనురాగం మాటున పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. ఇలా చేయడం వలన కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య ఏర్పడుతుంది. ఆర్థిక కూడా ఆదా అవుతుంది. చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లొచ్చు. 

తల్లిదండ్రులకు అద్దె ఇవ్వండి! అవును... మీది ఉమ్మడి కుటుంబం అనుకోండి.. కలిసి ఉంటున్నారు.. ఇల్లు మీ నాన్నగారి పేరు మీదో, మీ అమ్మగారి పేరుమీదో ఉందనుకోండి.. మీరు ప్రతి నెల అద్దె వారికే ఇవ్వండి.. ఆ మేరకు ఖర్చు చూపించండి. బ్యాంకు ద్వారా రెంటు డిపాజిట్‌ చేయండి. మీ స్వంత ఆదాయం లెక్కించేటప్పుడు ఇంటి అద్దెని క్లెయిం చేయండి. ఆ మేరకు ఆదాయం తగ్గడం వలన మీకు పన్ను భారం తగ్గుతుంది. మీ కుటుంబ ఆదాయంలో కానీ ఖర్చుల్లో కానీ ఏ మార్పు ఉండదు. 

అటుపక్క వారికి వారి ఆదాయంలో ఈ అద్దెను ఆదాయంగా చూపించండి. అద్దెలోంచి మున్సిపల్‌ పన్నులు.. 30శాతం మరమ్మతులు కింద తగ్గుతాయి. ఇంటి మీద లోన్‌ ఉంటే వడ్డీ కూడా తగ్గించుకోవచ్చు. ఎలాగూ అమ్మ నాన్న సీనియర్‌ సిటిజన్లు కాబట్టి వారికి బేసిక్‌ లిమిట్‌ ఎక్కువ ఉంటుంది. ఆ మేరకు ఆదాయం పన్నుకి గురి కాదు. ఈ విధంగా మీకు ప్రయోజనం కలుగుతుంది. అవసరమయితే ఈ మేరకు అగ్రిమెంటు రాసుకోండి. మీ యజమానికి మీ తల్లి దండ్రుల పాన్‌ కార్డు జిరాక్స్‌ ఇవ్వండి. పన్ను భారం కుటుంబం మీద పడదు. ఎవరి ఆదాయం వారిదే, ఎవరి పన్ను భారం వారిదే. 

మీ తల్లిదండ్రులు మీ మీద ఆధార పడ్డ వారయితే వారి బాగోగులు మీరు చూసుకోవాలి. ఈ రోజుల్లో ఆరోగ్యం విషయం ఇంకా జాగ్రత్త వహించాలి. సెక్షన్‌ 80ఈ కింద మెడి క్లెయిమ్‌ చెల్లించితే పూర్తి మినహాయింపు ఆదాయం లోంచి వస్తుంది. తల్లి దండ్రులు సీనియర్‌ సిటిజన్లు అయితే రూ.75,000 వరకు ఆదాయంలోంచి తగ్గిస్తారు. దీని వలన 30శాతం రేటులో ఉన్నవారికి రూ.23,400 పన్ను భారం తగ్గుతుంది. మెడిక్లెయిమ్‌ ద్వారా అవసరం వస్తే మెడికల్‌ ట్రీట్‌ మెంట్‌ చేయించుకోవచ్చు. పెద్దల బాగోగులు చూసి, వారి ఆరోగ్యం కాపాడుకోవచ్చు. మీకు పన్ను భారం తగ్గుతుంది. ఇక తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఎన్నో లక్షలు వెచ్చించి పిల్లల్ని చదివిస్తున్నారు. పెద్దలు చదువు కొంటున్నారు. పిల్లలు చదువుకుంటున్నారు. అప్పుడప్పుడు అప్పలు చేసి మరీ చదివిస్తున్నారు. అప్పులు చేసినందుకు అసలు తీర్చక తప్పదు. వడ్డీ కట్టక తప్పదు. అలాంటి వడ్డీకి సెక్షన్‌ 80యు కింద ఆదాయం లోంచి మినహాయింపు ఇస్తారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈ మినహాయింపు ఇస్తారు. పన్ను భారం తగ్గుతుంది.

- ట్యాక్సేషన్‌ నిపుణుల సూచనలు

చదవండి: 

రెండు సెకన్లకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌!

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారీ ఊరట

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top