ఒక్క ప్రాజెక్టు కోసం పోటీపడుతున్న ఆరు కంపెనీలు

Tatas, Shapoorji, others in race to build India's largest maritime museum - Sakshi

గుజరాత్‌లోని లోథల్‌లో రూ.4,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేబోయే నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్(ఎన్‌ఎంహెచ్‌సీ) ప్రాజెక్టు దక్కించుకోవడం కోసం ఆరు ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థలు పోటీ పడుతున్నాయి. టాటా గ్రూప్, షాపూర్జీ పల్లోంజీ, కెఈసీ ఇంటర్నేషనల్, క్యూబ్ ఇన్ ఫ్రా, అహ్లువాలియా కాంట్రాక్ట్ కంపెనీలు ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం బిడ్లను సమర్పించినట్లు ప్రభుత్వ అధికారులు మీడియాకు తెలిపారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు 80 కి.మీ దూరంలో ఉన్న లోథాల్‌లో, ఏఎస్‌ఐ ప్రాంతానికి సమీపంలో ఎన్‌ఎంహెచ్‌సీని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు.

పూర్వకాలం నుంచి ప్రస్తుతకాలం వరకు ఉన్న మన దేశ సముద్ర వారసత్వాన్ని ప్రదర్శించే ప్రాంతంగా, ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా దీనిని తీర్చిదిద్దనున్నారు. భారతదేశ సముద్ర వారసత్వంపై ప్రపంచానికి అవగాహన పెంచడానికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన "ఎడ్యుటైన్‌మెంట్‌" విధానాన్ని ఇక్కడ ఉపయోగిస్తారు. సౌరాష్ట్ర ప్రాంతంలో సబర్మతి నది, దాని ఉపనది భోగవో మధ్య ఉన్న పురాతన సింధు లోయ నాగరికత దక్షిణ నగరాల్లో లోథల్ ఒకటి. ఎంఎంహెచ్‌సీని 400 ఎకరాల్లో అభివృద్ధి చేస్తారు. జాతీయ సముద్ర వారసత్వ ప్రదర్శనశాల, లైట్‌హౌస్‌ మ్యూజియం, వారసత్వ అంశాలతో రూపొందించిన పార్కు, మ్యూజియం తరహా హోటళ్లు, సముద్ర తరహా పర్యావరణహిత రిసార్టులు, సముద్ర సంస్థ వంటి విశిష్ఠ నిర్మాణాలను దశలవారీగా ఇక్కడ చేపడతారు.

(చదవండి: భూమ్మీద కాదు, అంతరిక్షంపై ఆదిపత్యం కోసం పోటా పోటీ పడుతున్నారు)

ప్రపంచంలోని అతిపెద్ద సముద్ర మ్యూజియంలలో ఒకటిగా దీనిని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తుంది. గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికే సరాగ్ వాలా గ్రామంలో 375 ఎకరాల భూమిని 99 సంవత్సరాలకు లీజుకు ఇచ్చింది. క్రీ.పూ.2400 కాలంలో ఉన్న సింధు లోయ నాగరికత నాటి ప్రముఖ నగరాల్లో ఒకటైన పురాతన లోథల్ నగరాన్ని పునర్నిర్మించడం ఎన్‌ఎంహెచ్‌సీ ప్రత్యేకత. దీనికితోడు, వివిధ కాలాల్లో వర్ధిల్లిన భారత సముద్ర వారసత్వాన్ని వివిధ గ్యాలరీల ద్వారా ప్రదర్శిస్తారు. సముద్ర తీర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ సముద్ర సంబంధ కళాఖండాలు/ వారసత్వాన్ని ప్రదర్శించడానికి ఎన్‌ఎంహెచ్‌సీలో ప్రత్యేక కేటాయింపు ఉంటుంది. సముద్ర వారసత్వ సముదాయం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఇది ఉంటుంది. 2026 నాటికి మూడు దశల్లో దీనిని అభివృద్ధి చేయనున్నారు.

(చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ ఎప్పుడో తెలుసా?)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top