‘బ్లాక్‌చెయిన్‌’పై తాన్లా దృష్టి

Tanla Platforms Innovation Center in Hyderabad - Sakshi

హైదరాబాద్‌లో ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటు

మార్చి నాటికి అందుబాటులోకి

కంపెనీ చైర్మన్‌ ఉదయ్‌ రెడ్డి వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీ సీపాస్‌ (కమ్యూనికేషన్‌ ప్లాట్‌ఫాం యాజ్‌ ఏ సర్వీస్‌) దిగ్గజం తాన్లా ప్లాట్‌ఫామ్స్‌.. కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్‌ అండ్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తోంది. ప్రత్యేకంగా బ్లాక్‌చెయిన్, ఆర్టీఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషీ న్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), క్రిప్టోగ్రఫీ తదితర అంశాల్లో ఆవిష్కరణల కోసం దీన్ని ఉపయోగించనుంది.

సుమారు 92,000 చ.అ. విస్తీర్ణంలో దాదాపు రూ. 70 కోట్లతో ఈ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు క్యూ2 ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ వ్యవస్థాపక చైర్మన్, సీఈవో ఉదయ్‌ రెడ్డి తెలిపారు. దీనికోసం 300 మంది సిబ్బందిని రిక్రూట్‌ చేసుకుంటున్న ట్లు, మార్చి నాటి కల్లా ఇది అందుబాటులోకి రానున్నట్లు ఆయన చెప్పారు. అలాగే, టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో కలిసి అందిస్తున్న వైజ్‌లీ ప్లాట్‌ఫామ్‌ను నాలుగో త్రైమాసికంలో అంతర్జాతీయ మార్కెట్లలో పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతోందని ఉదయ్‌ రెడ్డి వివరించారు. దీనికి సంబంధించి ఒక అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ అడ్వైజరీ సర్వీసులు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

గేమింగ్, ఫిన్‌టెక్‌తో సీపాస్‌కు ఊతం..
కొన్నాళ్లుగా నెలకొన్న పరిస్థితులతో డిజిటలైజేషన్‌  జోరందుకుందని, దీంతో సీపాస్‌ విభాగానికి మరింత ఊతం లభిస్తోందని ఉదయ్‌ రెడ్డి తెలిపారు. బ్యాంకింగ్, బీమా, ఎడ్‌టెక్, గేమింగ్, ఫిన్‌టెక్‌ తదితర విభాగాలు ఇందుకు గణనీయంగా తోడ్పడుతున్నాయని చెప్పారు. ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్స్‌ మొదలైన వాటి రూపంలో వినియోగదారులకు కంపెనీలు సందేశాలు పంపేందుకు అవసరమైన సీపాస్‌ సర్వీసులకు డిమాండ్‌ భారీగా పెరుగుతోందని పేర్కొన్నారు.

ఆటో–డెబిట్‌ నిబంధనల్లో మార్పులు వంటి నియంత్రణ సంస్థలపరమైన చర్యలు, వాట్సాప్‌ లాంటి ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్‌లకు కావాల్సిన సర్వీసులు మొదలైనవి సంస్థ వ్యాపార వృద్ధికి దోహదపడుతున్నాయని ఉదయ్‌ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో తాన్లా అవకాశాలను అందిపుచ్చుకుని, వేగంగా వృద్ధి చెందుతోందని ఉదయ్‌ రెడ్డి చెప్పారు. దేశీ రెవెన్యూ మార్కెట్లో తమ వాటా 45 శాతం పైగా ఉందని ఆయన వివరించారు. కోవిడ్‌ టీకాల విషయంలో ఓటీపీలు మొదలైనవి పంపేందుకు సంబంధించి ప్రభుత్వానికి కూడా తమ సంస్థ సరీ్వసులు అందిస్తోందని పేర్కొన్నారు.

క్యూ2లో లాభం 67% జూమ్‌..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన 67% ఎగిసి రూ. 136 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం రూ. 81 కోట్లు. ఆదాయం 44% వృద్ధితో రూ. 842 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇది రూ. 583 కోట్లు. ప్రస్తుత కస్టమర్లతో పాటు కొత్త కస్టమర్ల చేరిక, మార్కెట్‌ వాటా పెంచుకోవడం తదితర అంశాల ఊతంతో ఇది సాధ్యపడిందని ఉదయ్‌ రెడ్డి వివరించారు.  సమీక్షాకాలంలో కొత్తగా 87 కస్టమర్లు జతయ్యారని ఆయన పేర్కొన్నారు. క్యూ4లో 111 మంది ఉద్యోగులు చేరారు. పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్‌ (ఈఎస్‌జీ) లక్ష్యాలకు సంబంధించి తెలంగాణ విద్యా శాఖతో తాన్లా ఫౌండేషన్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top