ఒంటరి మహిళల ఉమ్మడి శక్తి

The Success Story Of Hyderabad Based Luqma Kitchen - Sakshi

బిజినెస్‌ అంటే వందల కోట్ల డబ్బులు సంపాదించడం కాదు... చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తేవడం, ఉపాధి కల్పించి సమాజంలో సంపదను సృష్టించడం. అందుకే వ్యాపార వర్గాలకు ప్రభుత్వాలు రెడ్‌ కార్పెట్‌ వేసి ఆహ్వానిస్తాయి. అయితే ఇక్కడ ఏ కార్పోరేట్‌ సంస్థ అడుగు పెట్టలేదు, ప్రభుత్వం నుంచి సహాకారం అందలేదు. అయినా సరే చీకటి నిండిన జీవితాల్లో వెలుగు వచ్చాయి.

► పాతబస్తీకి చెందిన సలేహాకు ముగ్గురు పిల్లలు. ఉన్నట్టుండి భర్త విడాకులు ఇచ్చేశాడు. కనీసం భరణం కూడా ఇవ్వలేదు. అక్షర జ్ఞానం అసలే లేదు. ముగ్గురు పిల్లల పోషణకు టైలరింగ్‌ చేసినా అది కుటుంబ పోషణకు సరిపోలేదు. తన చేతి వంట బాగుంటదనే పేరు తప్ప ఆమెకంటే ప్రత్యేకతలు ఏమీ లేవు. 

► భర్త చనిపోవడంతో ఉన్న కొడుకుతో పాటు అత్తమామలను బాగోగులు యాభై ఏళ్ల బదరున్సీసాపై పడ్డాయి. స్థానికంగా చిన్న హోటల్‌ నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఓ రోజు ఆ హోటల్‌లో దొంగతనం జరగడంతో.. అప్పులపాలై తిరిగి హోటల్‌ నిర్వహించలేని స్థితికి చేరుకుంది. సలేహా, బదరున్నీసా లాంటి మరో పదిమూడు మంది మహిళలది ఇంచుమించు ఇలాంటి కథలే. అందరి జీవితాల్లో కామన్‌ పాయింట్స్‌.. తోడుండాల్సిన భర్త అండగా లేకపోవడం, నిత్యం నరకం చూపించే భర్త నుంచి విడిపోవడం. మరోవైపు తిండికి బట్టకు విద్యకు తమపైనే ఆధారపడ్డ కుటుంబాలు. 

ఉమ్మడి శక్తి
ఒంటరి మహిళ అంటే బలహీనం, కానీ అలాంటి ఒంటరి మహిళలు ఐక్యంగా మారితే, తమలో ఉన్న స్కిల్‌కి పదును పెడితే, దానికి వ్యాపార మెలకువలను అద్దితే వారి జీవితాల్లో వెలుగు నిండటమే కాదు, మరికొందరి కష్టాలు తీర్చేందుకు సైతం ఉపయోగపడింది.  హైదరాబాద్‌లోని ఓల్డ్‌ సిటీ ఒంటరి మహిళల ఉమ్మడి శక్తికి ప్రతిరూపమే లుక్మా కిచెన్‌. లుక్మా అంటే నోరూరించే అనే తెలుగు పదానికి ఉర్థులో సమానార్థం వస్తుంది. 

సఫా సహకారంతో
హైదరాబాద్‌లో పాతబస్తీలో పని చేసే సఫా ఎన్జీవో సంస్థ చేపట్టిన వివిధ కార్యకర్రమాల్లో సలేహా, బదరున్నీసా వంటి ఒంటరి మహిళలు భాగస్వాములుగా ఉన్నారు. భర్త తోడుగా లేకపోయినా ఒంటరిగా కష్టాలు పడుతూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఎంత కష్టం చేసిన వచ్చే ప్రతిఫలం అంతంతే. ఇలాంటి ఒంటరి మహిళలకు సఫా చేయూతను అందించి వారందరికి బ్యూటీషియన్‌, టైలరింగ్‌లలో శిక్షణ ఇచ్చారు.

కమ్యూనిటీ కిచెన్‌
సఫా శిక్షణ కేంద్రంలో చాలా మంది తాము టైలరింగ్‌ , బ్యూటీషియన్‌ కోర్సులు చేయలేమని కాకపోతే చాలా బాగా వంట చేస్తామని చెప్పారు. ఇలా రుచికరమైన వంటలు చేసే వారికి ఒక్క తాటిపైకి తెచ్చి లుక్మా పేరుతో కమ్యూనిటీ కిచెన్‌ని 2019లో ప్రారంభించారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా వంటి సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభించారు. ఫోన్‌లోనే ఆర్డర్లు తీసుకుంటూ వ్యాపారం మొదలుపెట్టారు. 

కోవిడ్‌తో కోలుకున్నారు
లుక్మా కిచెన్‌ ప్రారంభమైనా ఆర్డర్లు అంతంత మాత్రమే. తమ జీవితాలు వెలుగు నిండే రోజే లేదా అని ఆలోచిస్తున్న సమయంలో కరోనా సంక్షోభం తలెత్తింది. హోటళ్లు మూతపడ్డాయి, బయట తిండి దొరకని పరిస్థితి, మరోవైపు పొట్ట చేతబట్టుకుని సొంతూళ్లకు పయణమైన వలస కార్మికులు. ఈ విపత్కర పరిస్థితులు కొడిగట్టిపోతున్న లుక్మా కిచెన్‌కి ఊపిరి అందించింది. వలస కార్మికులకు భోజనం అందించేందుకు సిద్ధపడిన ఎన్జీవోలు, దాతలు లుక్మాను సంప్రదించారు. అలా చేతి నిండా పని దొరికింది. వారి వంటల గురించి నలుగురికి తెలిసింది.

ఇంటి వంట
సాధారణ హోటల్‌ ఫుడ్‌కు భిన్నంగా ఇంటి తరహా వంటలు అందివ్వడమే లుక్మాను ప్రత్యేకంగా నిలబెట్టింది. లుక్మా నుంచి ఫుడ్‌ కావాలంటే ఒక రోజు ముందుగానే ఆర్డర్‌ బుక్‌ చేసుకోవాలి. అప్పుడు తీసుకున్న ఆర్డర్‌ ప్రకారం పూర్తిగా ఇంటి తరహా పద్దతిలోనే వంటలు తయారు చేసి డెలివరీ ఇస్తారు. లుక్మాకు వచ్చే ఆర్డర్లలో ఎక్కువగా కిట్టీ పార్టీలు, బర్త్‌ డే, వెడ్డింగ్‌డే, గెట్‌ టూ గెదర్‌కి సంబంధించిన ఆర్డర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంటి ఫుడ్‌ మాత్రమే కావాలనుకునే వారి నుంచి సైతం ఆర్డర్లు స్వీకరిస్తున్నారు. 

లుక్మా స్పెషల్స్‌
లుక్మా కిచెన్‌లో హైదరాబాద్‌ స్పెషల్‌ వంటకాలైన ఖట్టీదాల్‌, బగార్‌ ఏ బైగన్‌, దమ్‌ కా కీమా, దాల్‌చా, ఆచారి చికెన్‌, తలావా ఘోష్‌, ఖుబూలీ, దస్తీరోటీ, మిర్చీకా సలాన్‌, షమీ కబాబ్‌, చికెన్‌ కట్‌లెట్స్‌, గిలే ఏ ఫిర్దౌస్‌, ఖుబాని కా మీఠా, డబుల్‌ కా మీఠా తదిరత రుచికరమైన వంటకాలు లభిస్తాయి. 

గాడిన పడ్డ బతుకులు
ఒకప్పుడు టైలరింగ్‌ ఇతర చేతి వృత్తి పనులు చేసుకుంటూ నెలకు కేవలం రూ.5000 సంపాదించడమే వారికి చాలా కష్టంగా ఉండేది. లుక్మా వారి జీవితాల్లోకి వచ్చిన తర్వాత కడుపు నిండా తిండే కాదు వాళ్లింట్లో పిల్లల చదువులకు సైతం ఇబ్బంది లేని స్థితికి చేరుకున్నారు. 

ఫ్యూచర్‌ ప్లానింగ్‌
లుక్మా కిచెన్‌తో ఒకప్పటి తమ కష్టాలు తీరిపోయాయి ఇక రిలాక్స్‌ అవుదామనే ఆలోచనలో లేదు లుక్మా టీం. తమ వ్యాపారంలో వచ్చిన డబ్బులో సగం రా మెటీరియల్‌కు ఇచ్చేయగా, మిగిలిన దాంట్లో ముప్పై శాతాన్ని తమ వేతనంగా తీసుకుంటున్నారు. మిగిలిన 20 శాతాన్ని వ్యాపార విస్తరణ కోసం సేవ్‌ చేస్తున్నారు. ఇప్పటికే లుక్మా కిచెన్‌ నుంచి మసాలాలు తయారు చేసి విక్రయిస్తున్నారు.


న్యూ సిటీకి వచ్చేస్తాం
లుక్మా కిచెన్‌ ఓల్డ్‌ సిటీలో ఉన్నప్పటికీ ఆర్డర్లు ఎక్కువగా న్యూ సిటీ నుంచే వస్తున్నాయి. అంతేకాదు ఇటీవల గచ్చిబౌలీలో కొలువైన ఐటీ ఎంప్లాయిస్‌ సైతం లుక్మా టేస్ట్‌కి ఫిదా అయిపోతున్నారు. అక్కడి నుంచి కూడా స్పెషల్‌ డేస్‌కి ఆర్డర్లు పెరుగుతున్నాయి. దీంతో న్యూ సిటీలో రెండో బ్రాంచ్‌ ప్రారంభానికి రెడీ అవుతోంది లుక్మా టీం. 

అవకాశాన్ని అంది పుచ్చుకుని
వ్యాపారం, స్టార్టప్‌లు ప్రారంభించాలంటే మంచి కుటుంబ నేపథ్యం, ఉన్నత విద్య, లక్షల కొద్ది పెట్టుబడి అక్కర్లేదు. సాధారణ కుటుంబ నేపథ్యం ఉన్న వారైనా సరై తమకున్న నైపుణ్యానికే  కొంచెం ఓర్పు, మరికొంత నేర్పు జత చేస్తే చాలని నిరూపించారు.  అక్షర జ్ఞానం లేకున్నా సరే సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించి ఫోన్ల ద్వారా ఆర్డర్లు స్వీకరించి కమ్మని వంటలు అందిస్తున్నారు. తమ కుటుంబ కష్టాలను గట్టెక్కించారు.

- సాక్షి, వెబ్‌ ప్రత్యేకం

చదవండి : వర్కింగ్‌ విమెన్‌: మీకోసమే ఈ డ్రెస్సింగ్‌ స్టైల్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top