క్రాష్‌ మార్కెట్‌ | Stock Market: Sensex plummet 1390 pts: Nifty ends below 23200 | Sakshi
Sakshi News home page

క్రాష్‌ మార్కెట్‌

Apr 2 2025 3:34 AM | Updated on Apr 2 2025 8:03 AM

Stock Market: Sensex plummet 1390 pts: Nifty ends below 23200

దలాల్‌ స్ట్రీట్‌కు ‘లిబరేషన్‌ డే’ ఫీవర్‌

రూ.3.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి 

సెన్సెక్స్‌ 1,390 పాయింట్ల పతనం 

23,200 స్థాయి దిగువకు నిఫ్టీ 

ప్రతీకార సుంకాల అమలు భయాలతో భారీ అమ్మకాలు  

2025–26 ఆర్థిక సంవత్సరానికి నష్టాలతో స్వాగతం

ముంబై: అమెరికా ‘లిబరేషన్‌ డే’ అనిశ్చితి తారస్థాయికి చేరుకోవడంతో మంగళవారం దలాల్‌ స్ట్రీట్‌  దాదాపు 2% క్షీణించింది. ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాల విధింపు అమలు రోజు ఏప్రిల్‌ 2ను డొనాల్డ్‌ ట్రంప్‌ ‘అమెరికా లిబరేషన్‌ డే’గా అభివర్ణించారు. క్రూడాయిల్‌ ధరలు అయిదు వారాల గరిష్టానికి చేరుకోవడం,  భారత ఈక్విటీ మార్కెట్‌ మార్చిలో భారీ ర్యాలీ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం తదితర అంశాలూ ప్రతికూల ప్రభావం చూపాయి. 

ఫలితంగా సెన్సెక్స్‌ 1,390 పాయింట్లు క్షీణించి 76,025 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 354 పాయింట్లు పతనమై 23,166 వద్ద స్థిరపడింది. కొత్త ఆర్థిక సంవత్సరం(2025–26) తొలిరోజున స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు...  ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల ప్రభావంతో రోజంతా నష్టాలతో ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 1,503 పాయింట్లు క్షీణించి 75,912 వద్ద, నిఫ్టీ 383 పాయింట్లు పతనమై 23,136 వద్ద కనిష్టాలు తాకాయి.

టెలికమ్యూనికేషన్, ఆయిల్‌అండ్‌గ్యాస్‌ మినహా అన్ని రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఐటీ, ప్రైవేటు రంగ బ్యాంకుల షేర్లలో భారీ విక్రయాలు జరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1% నష్టపోయింది. స్మాల్‌క్యాప్‌ సూచీ స్వల్పంగా 0.07 శాతం లాభపడింది. సూచీల వారీగా రియల్టీ 3%, కన్జూమర్‌ డ్యూరబుల్స్, ఐటీ 2.50%, ఫైనాన్షియల్‌ సర్విసెస్‌ 2%, బ్యాంకెక్స్‌ 1.50 శాతం నష్టపోయాయి. 

⇒  సూచీల 2% మేర పతనంతో మంగళవారం రూ.3.5 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.409.43 లక్షల కోట్లు(4.78 ట్రిలియన్‌ డాలర్లు)కు దిగివచ్చింది. 

⇒  వొడాఫోన్‌ ఐడియా షేరు 19% లాభపడి రూ.8.10 వద్ద స్థిరపడింది. స్పెక్ట్రమ్‌ వేలం బకాయిలు రూ.36,950 కోట్ల బదులుగా ఈక్విటీల రూపంలో వాటాను తీసుకునేందుకు కేంద్రం అంగీకరించిందంటూ వీఐ ఆదివారం ఎక్స్చేంజ్ కు సమాచారం ఇచ్చింది. దీంతో వీఐలో కేంద్రం వాటా 48.99 శాతానికి చేరనుంది. ఇంట్రాడేలో 26% ఎగసి రూ.8.56 వద్ద గరిష్టాన్ని తాకింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.9,210 కోట్లు పెరిగి రూ. 57,828 కోట్లకు చేరింది. 

సెన్సెక్స్‌ సూచీలోని 30 షేర్లలో ఇండస్‌ఇండ్‌ 5%, జొమాటో 0.27% మాత్రమే లాభపడ్డాయి. అత్యధికంగా హెచ్‌సీఎల్‌ టెక్‌ 4%, బజాజ్‌ఫిన్‌సర్వ్‌ 3.50%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 3.35%, బజాజ్‌ ఫైనాన్స్‌3%, ఇన్ఫోసిస్‌ 3% నష్టపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement