Stock Market: మూడో రోజూ ముందుకే 

Stock Market: Sensex Closes 157 Points Higher At 58 807  Nifty Ends At 17 516 - Sakshi

ఆటుపోట్ల మధ్య లాభాలు 

సెన్సెక్స్‌ 157 పాయింట్లు అప్‌ 

58,807 వద్ద ముగింపు 

మళ్లీ 17,500 అధిగమించిన నిఫ్టీ 

ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తున్న సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజూ బలపడ్డాయి. సెన్సెక్స్‌ 157 పాయింట్లు పుంజుకుని 58,807 వద్ద నిలిచింది. నిఫ్టీ 47 పాయింట్లు లాభపడి 17,517 వద్ద ముగిసింది. ప్రధానంగా ఇంధన, ఎఫ్‌ఎంసీజీ, ఇన్‌ఫ్రా రంగ కౌంటర్లలో కొనుగోళ్లు మార్కెట్లకు ప్రోత్సాహాన్నిచ్చాయి.

అయితే తొలుత మార్కెట్లు ఒడిదొడుకులను చవిచూశాయి. తదుపరి కొనుగోళ్లదే పైచేయి కావడంతో చివరికి లాభాలతో నిలిచాయి. వెరసి 181 పాయింట్ల వృద్ధితో 58,831 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 58,890 వద్ద గరిష్టాన్ని అందుకుంది. తదుపరి 58,341 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది.   

ఐటీసీ జూమ్‌: సెన్సెక్స్‌ దిగ్గజాలలో ఐటీసీ దాదాపు 5 శాతం జంప్‌చేయగా.. ఎల్‌అండ్‌టీ, ఏషియన్‌ పెయింట్స్, ఆర్‌ఐఎల్, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫైనాన్స్, డాక్టర్‌ రెడ్డీస్, ఇన్ఫోసిస్‌ 3–0.6 శాతం మధ్య ఎగశాయి. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటన్, నెస్లే ఇండియా, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, టీసీఎస్, ఎస్‌బీఐ, కొటక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ 1.7–0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి.

రంగాలవారీగా చూస్తే క్యాపిటల్‌ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జీ, టెలికం, ఇండస్ట్రియల్స్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 2–1 శాతం మధ్య పుంజుకున్నాయి. మరోవైపు బ్యాంకెక్స్, ఫైనాన్స్, కన్జూమర్‌ డ్యురబుల్స్, రియల్టీ అమ్మకాలతో 0.5–0.2 శాతం మధ్య నీరసించాయి. 

చిన్న షేర్లు ఓకే
బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.4 శాతం, స్మాల్‌ క్యాప్‌ 0.8 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 2,074 లాభాలతో నిలవగా.. 1,201 మాత్రమే నష్టపోయాయి. 

ఇతర హైలైట్స్‌ 
బాండ్లు కలిగిన ఇన్వెస్టర్లకు వడ్డీ చెల్లింపు లకుగాను రూ. 6,000 కోట్లవరకూ నిధుల సమీకరణ చేపట్టినట్లు వెలువడిన వార్తలు మొబైల్‌ టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా కౌంటర్‌కు డిమాండును పెంచాయి. దీంతో బీఎస్‌ఈలో ఈ షేరు 15 శాతం దూసుకెళ్లి రూ. 16.43 వద్ద ముగిసింది. ఒక దశలో రూ. 16.7 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. బీఎస్‌ఈలో 2.8 కోట్లు, ఎన్‌ఎస్‌ఈలో 133 కోట్ల షేర్లు చొప్పున ట్రేడయ్యాయి. 

రానున్న ఏడాది కాలంలో ప్రపంచ చక్కెర ధరలు అధిక స్థాయిల్లోనే కొనసాగనున్నట్లు వెలువడిన అంచనాలు షుగర్‌ స్టాక్స్‌లో భారీ కొనుగోళ్లకు దారిచూపాయి.

మూడు రోజులుగా ర్యాలీ చేస్తున్న దేవయాని ఇంటర్నేషనల్‌ మరోసారి దాదాపు 5% ఎగసి రూ. 184 వద్ద నిలిచింది. కేఎఫ్‌సీ, పిజ్జా హట్‌ రెస్టారెంట్ల నిర్వాహక ఈ కంపెనీ ఆగస్ట్‌లో రూ. 90 ధరలో ఐపీవోకు వచ్చింది. తదుపరి ఈ షేరు ఇప్పటివరూ 111 శాతం దూసుకెళ్లింది. 

జేకే ఫైల్స్‌ ఐపీవోకు రెడీ: 800 కోట్ల సమీకరణ యోచన


టూల్స్, ఫైళ్లు, డ్రిల్స్‌ తయారీలో వినియోగించే ప్రెసిషన్‌ ఇంజినీర్డ్‌ విడిభాగాలు రూపొందిస్తున్న జేకే ఫైల్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. రేమండ్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌గా కలిగిన కంపెనీ ఐపీవో ద్వారా రూ. 800 కోట్లు సమకూర్చుకోవాలని భావి స్తోంది. ప్రస్తుతం జేకే ఫైల్స్‌లో రేమండ్‌ 100 శాతం వాటా కలిగి ఉంది. పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా జేకే ఫైల్స్‌ ఉద్యోగులకు సైతం ఈక్విటీ షేర్లను కేటాయించనుంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top