ప్లస్‌ 631 నుంచి మైనస్‌ 100 పాయింట్లకు

Stock Market Highlights: Sensex Closes 100 Points Lower At 53134 Nifty 50 Ends At 15810 - Sakshi

మిడ్‌సెషన్‌ నుంచి అమ్మకాలు  

ఆరంభ లాభాలు ఆవిరి  

సెన్సెక్స్‌ నష్టం 100 పాయింట్లు  

ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు 

ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ 

ముంబై: మిడ్‌సెషన్‌ నుంచి ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్ల నష్టంతో 53,134 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 36 పాయింట్లు పతనమై 15,798 వద్ద నిలిచింది.  మెటల్, ఫార్మా, ఇంధన షేర్లకు మాత్రమే స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ సూచీ అరశాతం నష్టపోగా, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.20శాతం నష్టపోయింది.

విదేశీ ఇన్వెస్టర్లు ఈ 30 తేదీ తర్వాత తొలిసారిగా రూ.1,296 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.258 కోట్ల అమ్మేశారు. ఆసియాలో జపాన్, హాంగ్‌కాంగ్, తైవాన్, దక్షిణ కొరియా, ఇండోనేషియా మార్కెట్లు లాభపడ్డాయి. చైనా, సింగపూర్‌ స్టాక్‌ సూచీలు నష్టపోయాయి. యూరప్‌ మార్కెట్లు రెండున్నర శాతం క్షీణించాయి. బర్త్‌ ఆఫ్‌ అమెరికన్‌ ఇండిపెండెన్స్‌(జూలై 4) సందర్భంగా  సోమవారం అమెరికా మార్కెట్లకు సెలవు కాగా అక్కడి స్టాక్‌ సూచీలు 2 శాతం మేర భారీ  నష్టాలతో ట్రేడవుతున్నాయి.

సెన్సెక్స్‌ గరిష్టం నుంచి 731 పాయింట్ల పతనం  
సెన్సెక్స్‌ ఉదయం 266 పాయింట్ల లాభంతో 53,501 వద్ద మొదలైంది. నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 15,909 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రథమార్థంలో ఆసియా మార్కెట్ల నుంచి సానుకూలతలు అందాయి. భారత్‌లో సేవారంగ కార్యకలాపాలు జూన్‌ నెలలో 11 ఏళ్ల గరిష్టానికి చేరినట్లు గణాంకాలు వెలువడ్డాయి. మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్‌ ఇండెక్స్‌ దాదాపు ఒకశాతం క్షీణించి 20.79 శాతానికి దిగివచ్చింది.

ఈ సానుకూలాంశాలతో ఒక దశలో సెన్సెక్స్‌ 631 పాయింట్లు బలపడి 53,866 వద్ద, నిఫ్టీ 191 పాయింట్లు బలపడి 16,026 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. అయితే ఆర్థిక వృద్ధి మందగమన భయాలతో యూరప్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం కావడంతో సెంటిమెంట్‌ దెబ్బతింది. ద్వితీయార్థంలో ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్, ఐటీ షేర్లలో విక్రయాలు తలెత్తడంతో ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం(53,866) నుంచి 100 పాయింట్ల నష్టంతో 53,134 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 16,200 స్థాయిని నిలుపుకోవడంలో విఫలమైంది. ట్రేడింగ్‌లో గరిష్టస్థాయి (16,026) నుంచి 215 పాయింట్లు క్షీణించి 15,811 వద్ద స్థిరపడింది.

మార్కెట్లో మరిన్ని సంగతులు  
♦క్యూ1 ఫలితాలు ప్రకటన విడుదలకు ముందు(జూన్‌ 8న టీసీఎస్‌ క్యూ1 గణాంకాలు వెల్లడి) ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.  విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ షేర్లు ఒకశాతం నుంచి అరశాతం నష్టపోయాయి. 
♦జూన్‌ క్వార్టర్‌ ఫలితాలు నిరాశపరచడంతో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేరు ఏడుశాతం క్షీణించి రూ.81.40 వద్ద స్థిరపడింది.  
♦మోతీలాల్‌ ఓస్వాల్‌ ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగించడంతో ఎల్‌ఐసీ షేరు ఒకటిన్నర శాతం లాభపడి రూ.703 వద్ద నిలిచింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top