ఫెడ్‌ పాలసీ, ద్రవ్యోల్బణం దారి చూపొచ్చు!

Stock Experts Predict Market Movements This Week - Sakshi

స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి 

సూచీలు స్థిరీకరణ దిశగా సాగొచ్చు  

ఈ వారం మార్కెట్‌ కదలికలపై నిపుణుల అంచనా

ముంబై: ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య పరపతి సమావేశ నిర్ణయాలు ఈ వారం మార్కెట్లకు దారి చూపొచ్చని స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు. ఇదే వారంలో మూడు కంపెనీల ఐపీఓ లతో పాటు ఇటీవల పబ్లిక్‌ ఇష్యూ పూర్తి చేసుకున్న యూనిపార్ట్స్‌ ఇండియా ఎక్సే్చంజీల్లో లిస్టింగ్‌ కానుంది. అంతర్జాతీయంగా బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూ డాయిల్‌ ధర 80 డాలర్లకు చేరింది. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ట్రేడర్లు తమ పొజిషన్లను సమతూకం చేసుకోవాలి. పతనాన్ని కొనుగోలుకు అవకాశంగా మలుచుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు. 

ఆర్‌బీఐ వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక మందగమన భయాలు, ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశానికి ముందు అప్రమత్తత తదితర పరిణామాల నేపథ్యంలో గతవారంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా సెన్సెక్స్‌ 687 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయాయి.  

‘ప్రస్తుతం భారత స్టాక్‌ మార్కెట్‌ అధిక విలువ వద్ద ట్రేడవుతోంది. ఆదాయాల వృద్ధి మందగించ వచ్చనే అంచనాలు సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చు. స్టాక్‌ సూచీలు ఈ వారంలో పరిమితి శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ స్థిరీకరణ దిశగా సాగొచ్చు.

ఆర్థిక మాంద్య భయాల తో ఐటీ షేర్లలో అత్యధిక లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఆర్‌బీఐ కఠిన ద్రవ్య విధానానికే మొగ్గుచూపినప్పట్టికీ.., బ్యాంక్‌ నిఫ్టీ స్థిరంగా రాణించడం కలిసొచ్చే అంశంగా ఉంది. అయితే గతవారం నిఫ్టీ కీలకమైన 18,500 స్థాయిని కోల్పోయింది. అమ్మకాల ఒత్తిడి కొనసాగితే 18,400– 18,300 శ్రేణిలో తక్షణ మద్దతు లభించవచ్చు. ఎగువ స్థాయిలో 18,650–18,700 పరిధిలో నిరోధం ఎదురుకావచ్చు’ అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. 

ప్రపంచ పరిణామాలు  
బ్రిటన్‌ జీడీపీ, పారిశ్రామికోత్పత్తి, నవంబర్‌ వాణిజ్య లోటు డేటా నేడు(సోమవారం)విడుదల అవుతుంది. రేపు(మంగళవారం) అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రకటిస్తుంది. ఎల్లుండి(బుధవారం) ఫెడ్‌ రిజర్వ్‌ కమిటీ సమావేశ నిర్ణయాలు, యూరోజోన్‌ నవంబర్‌ పారిశ్రామికోత్పత్తి డేటా, చైనా నవంబర్‌ వాహన విక్రయాలు, బ్రిటన్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కానున్నాయి. గురువారం అమెరికా నవంబర్‌ రిటైల్‌ అమ్మకాలతో పాటు పారిశ్రామికోత్పత్తి డేటా విడుదల అవుతుంది.

అదే రోజున యూరోపియన్‌ కేంద్ర బ్యాంక్‌(ఈసీబీ) వడ్డీరేట్ల ప్రకటనతో పాటు జపాన్‌ వాణిజ్య లోటు గణాంకాలు.., చైనా పారిశ్రామికోత్పత్తి, నిరుద్యోగ రేటు, రిటైల్‌ అమ్మకాల డేటా..., బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ వడ్డీరేట్‌ నిర్ణయాలు వెల్లడి కానున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం అమెరికా, యూరోజోన్, బ్రిటన్‌  తయారీ రంగ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు విడుదల అవుతాయి. అదేరోజున యూరోజోన్‌ అక్టోబర్‌ వాణిజ్య లోటు, నవంబర్‌ ద్రవ్యోల్బణ డేటాతో పాటు విడుదల కానుంది.

స్థూల ఆర్థిక గణాంకాలు  
నేడు నవంబర్‌ దేశీయ వినియోగదారుల సూచీ ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం, అక్టోబర్‌ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెల్లడి కానున్నాయి. డబ్ల్యూపీ ద్రవ్యోల్బణ డేటా ఎల్లుండి(బుధవారం), వాణిజ్య లోటు గణాంకాలు(గురువారం) విడుదల అవుతుంది. అలాగే శుక్రవారం ఆర్‌బీఐ డిసెంబర్‌ తొమ్మిదో తేదీతో ముగిసిన ఫారెక్స్‌ నిల్వల డేటా, ఇదే నెల రెండో తేదీతో ముగిసిన డిపాజిట్‌– బ్యాంక్‌ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది.

దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ఇదే వారంలో వాహన పరిశ్రమ సమాఖ్య సియామ్‌ నవంబర్‌ వాహన విక్రయ డేటా, ఐఆర్‌డీఏఐ ఈ ఏడాది ప్రధమార్థం తొలి ప్రీమియం గణాంకాలు వెల్లడికానున్నాయి. ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది.

ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ సమావేశం  
అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ సమావేశం మంగళవారం(నవంబర్‌ 13న) ప్రారంభం కానుంది. మరుసటి రోజు(బుధవారం) ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ ద్రవ్య కమిటీ నిర్ణయాలను వెల్లడించనున్నారు. వరుసగా నాలుగుసార్లు వడ్డీరేట్లను 75 బేసిస్‌ పాయింట్లు చొప్పున ఫెడ్‌ ఈసారి మాత్రం 50 బేసిస్‌ పాయింట్లకు పరిమితం కావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ మరుసటి రోజే(గురువారం) బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌లు తమ ద్రవ్య విధాన వైఖరిని వెల్లడించనున్నాయి.

ఏడు రోజుల్లో రూ.4,500 కోట్ల అమ్మకాలు   
దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఈ డిసెంబర్‌ (1–11 తేదీల మధ్య)లో ఇప్పటి వరకు రూ.4500 కోట్ల ఈక్విటీలను విక్రయించారు. అంతర్జాతీయంగా డాలర్‌ ఇండెక్స్‌ విలువ దిగిరావడం ఇందుకు కారణమని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య విధాన వైఖరి(బుధవారం)కి ముందు ఎఫ్‌ఐఐలు అప్రమత్తత వహిస్తూ చివరి మూడు రోజుల్లో నికరంగా రూ.3,300 కోట్లను ఉపసహరించుకున్నారు.

‘‘భారత ఈక్విటీ మార్కెట్‌ సగటు కంటే అధిక విలువ వద్ద ట్రేడవుతుంది. కావున ఎఫ్‌ఐఐలు చౌక వాల్యూయేషన్లతో ట్రేడవుతున్న చైనా, కొరియా వంటి స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఎఫ్‌ఐఐలు ఆసక్తి చూపుతున్నారు. ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య విధాన వైఖరి వరకు భారత ఈక్విటీలపై విదేశీ ఇన్వెస్టర్లు బేరీష్‌ వైఖరినే కలిగి ఉండొచ్చు’’ అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయకుమార్‌ తెలిపారు. కాగా గడిచిన నవంబర్‌లో రూ.  36,329 కోట్లను కొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top