
ఆకలి విలువ చాలామందికి తెలియదని ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు ఎన్‌ఆర్.నారాయణమూర్తి అన్నారు. ‘ఆహార భద్రతలో సాధించిన విజయాలు: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల వైపు భారత్ ప్రయాణం’ అనే అంశంపై ఐక్యరాజ్య సమితిలో ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో ఆయన మాట్లాడారు.
‘యాభై ఏళ్ల కిందట యూరప్ సరిహద్దు ప్రాంతమైన బల్గేరియా, యుగోస్లేవియా మధ్య ఉన్న నిచ్ అనే ప్రదేశంలో పనిచేస్తున్నపుడు దాదాపు 120 గంటలపాటు(5రోజులు) తిండిలేక ఆకలితో బాధపడ్డాను. మీలో ఎవరికీ ఆకలిబాధ తెలియదు. ఆకలితో అలమటించే పరిస్థితి భారత్‌లో ఎవరికీ రాకూడదు. అక్షయపాత్ర కార్యక్రమంతో నిస్సాహాయుల ఆకలితీర్చడం గొప్పవిషయం. భారత ప్రభుత్వం యువతకు నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకుంటోంది. దేశ పౌరులందరూ పేద పిల్లల భవిష్యత్తు కోసం తోచినంత సహాయం చేయాలి.
ప్రభుత్వ ఆర్థిక విధానాలతో విదేశీ పెట్టుబడులు పెరిగి దేశం వృద్ధి సాధిస్తోంది. భారత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమం ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను నిర్వహిస్తున్నారు. దీని ద్వారా దాదాపు 80 కోట్ల మందికి పైగా ప్రయోజనం కలుగుతోంది. పీఎం పోషన్(పోషణ్ శక్తి నిర్మాణ్) పథకంతో నేరుగా 11 కోట్ల మంది పిల్లలకు పౌష్టికాహారం అందుతోంది’ అని మూర్తి అన్నారు.
ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగువారు ఎక్కడంటే..