బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1.50 లక్షలకు చేరువలో ఉండగా.. కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ. 3 లక్షలు దాటేసింది.
పెట్టుబడిదారుల డిమాండ్, భౌగోళిక, రాజకీయ కారణాల వల్ల కేజీ వెండి రూ.3 లక్షల రికార్డును అధిగమించాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా వెండి ఔన్సు ధర ఏకంగా 94.35 డాలర్లు పెరిగింది. ఇటీవలి సెషన్లలో బంగారం కంటే వెండికి డిమాండ్ పెరుగుతోందని.. దీనికి డాలర్ విలువ తగ్గడం కూడా సహాయపడిందని నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజు (జనవరి 19) హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో కేజీ వెండి రేటు 8000 రూపాయలు పెరిగి, రూ. 3.18 లక్షలకు చేరింది. ముంబైలో కేజీ సిల్వర్ రేటు రూ. 10వేలు పెరిగినప్పటికీ రూ. 3.05 లక్షల వద్ద నిలిచింది. ఢిల్లీలో కూడా ఇదే రేటు వద్ద కొనసాగుతోంది.
ఇదీ చదవండి: ఊహించనంతగా పెరుగుతున్న బంగారం.. కారణమెవరు?
వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే?
వెండిని కేవలం ఆభరణాలు, కాయిన్స్ రూపంలో మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో.. ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుదలవైపు పరుగులు పెడతాయి.


