గత వారాంతాన వెండి కేజీ రూ. 2,50,000 వద్ద స్థిరపడగా.. సోమవారం రూ. 15,000 జంప్‌చేసి రూ. 2,65,000ను తాకిన విషయం విదితమే. తాజాగా మరో రూ. 6,000 బలపడటంతో రెండు రోజుల్లో 21,000 దూసుకెళ్లింది. 2026లో ఇప్పటివరకూ రూ. 32,000(13.4 శాతం) లాభపడింది. 2025 డిసెంబర్ 31న కేజీ వెండి రూ. 2,39,000 వద్ద ముగిసింది.
అన్ని పన్నులు కలుపుకుని 99.9 స్వచ్చత పసిడి 10 గ్రాములు సోమవారం రూ. 2,900 ఎగసి రూ. 1,44,600కు చేరగా.. తాజాగా మరో రూ. 400 లాభపడి రూ. 1,45,000ను తాకింది. మరోపక్క గ్లోబల్ మార్కెట్లలోనూ పసిడి ఔన్స్(31.1 గ్రాములు) సోమవారం 4,630 డాలర్ల వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. ఈ బాటలో వెండి ఔన్స్ 86.26 డాలర్ల వద్ద సరికొత్త గరిష్ట రికార్డ్ సాధించింది. మంగళవారం సైతం న్యూయార్క్ కామెక్స్ ఫ్యూచర్స్‌లో తొలుత బంగారం(ఫిబ్రవరి కాంట్రాక్ట్) 4,632 డాలర్లకు, వెండి(మార్చి) 88.56 డాలర్లకు చేరడం గమనార్హం!


