భారత్ దెబ్బకు చైనా భారీగా నష్టపోనుందా?

Semiconductor Crunch: Govt Plans Mega Package To Woo Investments - Sakshi

Semiconductor Manufacturing: కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చైనాకు భారీగా నష్టాలు కలిగించే అవకాశాలు ఉన్నాయా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయంగా సెమీకండక్టర్‌ చిప్‌ల కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కొరతను అధిగమించడానికి భారత్ ప్రయత్నిస్తుంది. దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి భారతదేశం మెగా మల్టీ-బిలియన్-డాలర్ క్యాపిటల్ సపోర్ట్, ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ ప్లాన్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా చిప్ కొరత కారణంగా అన్నీ రంగాలలోని పరిశ్రమలు భారీ ఉత్పత్తి కోతలను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ప్లాన్‌ రూపొందిస్తున్నట్లు ఉన్నత వర్గాలు తెలిపాయి.

టీఓఐ నివేదికప్రకారం, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు దేశంలో సెమీకండక్టర్ల పరిశ్రమలను ఏర్పాటు చేయాలని తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ(టీఎస్ఎంసీ), ఇంటెల్, ఎఎమ్‌డీ, యునైటెడ్ మైక్రోఎలక్ట్రానిక్స్ కార్ప్, ఫుజిట్సు వంటి కొన్ని అగ్ర సెమీకండక్టర్ తయారీదారులతో చర్చలు జరుపుతున్నారు. సెమీకండక్టర్ తయారీదారులను వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకురావాలనే ప్రధానమంత్రి కార్యాలయం ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. కంపెనీలను దేశంలోకి తీసుకురావడానికి ఆకర్షణీయమైన విధానంతో ముందుకు రావాలని బహుళ మంత్రిత్వ శాఖలు ఆదేశించింది. 

ప్రత్యేక ప్రోత్సాహకాలు
సెమీకండక్టర్ తయారీదారులకు దిగుమతి వస్తువులపై సుంకం రాయితీ ఇవ్వాలని భావిస్తున్నారు. అలాగే, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ & సెమీకండక్టర్(ఎస్ఎసీఎస్), తయారీని ప్రోత్సహించే పిఎల్ఐ స్కీం వంటి పథకాల నుంచి కూడా ప్రభుత్వం అదనపు ప్రయోజనాలను అందించాలని చూస్తుంది. దేశంలో సెమీకండక్టర్లను తయారు చేయకపోవడంతో దేశంలోని డిమాండ్ తీర్చడం కోసం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది. భారతదేశంలో సెమీకండక్టర్ల డిమాండ్ 2025 నాటికి ప్రస్తుతం ఉన్న 24 బిలియన్ డాలర్ల నుంచి సుమారు 100 బిలియన్ డాలర్లకు చేరుకొనున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. 

చైనాకు దెబ్బ
సెమీకండక్టర్ తయారీదారులను దేశానికి ఆకర్షించడానికి ఇంతకు ముందు చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, రక్షణ & ఆటో వంటి ఇతర రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా ఎలక్ట్రానిక్స్ మార్కెట్ అవసరాలు కంపెనీలను భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పిస్తుందని ప్రభుత్వం నమ్మకంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆశించిన మేరకు దేశంలో పెట్టుబడులు వస్తే మాత్రం చైనాకు దెబ్బ పడే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ల ఎగుమతి దేశంగా చైనా ఉంది. మన దేశంలో ఏర్పాటు కాబోయే ఈ పరిశ్రమ వల్ల ఆ దేశానికి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top