Russia Ukraine War Impact: ఎకానమీ వృద్ధి 7.4 శాతం!

Russia Ukraine War May Impact On Indian Economy - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ఎకానమీ ఏప్రిల్‌ 1వ తేదీతో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7.4 శాతం వృద్ధి నమోదవుతుందని ఫిక్కీ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ సర్వే పేర్కొంది. 6 శాతం కనిష్టం–7.8 శాతం గరిష్ట స్థాయిలో జీడీపీ పురోగతి ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొంది. వృద్ధి తక్కువ స్థాయికి పడే క్లిష్ట పరిస్థితులే ఉంటాయని విశ్లేషించింది.  ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం భారత్‌తో పాటు గ్లోబల్‌ ఎకానమీకి తీవ్ర సవాలని పేర్కొంది. 

కాగా, ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం) రేటు 50 నుంచి 75 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) పెరగవచ్చని సర్వే అంచనా వేసింది. సర్వేలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... 

► ఆర్‌బీఐ తన ఏప్రిల్‌ పాలసీ సమీక్షలో రెపో రేటును యథాతథంగా ఉంచుతుందని, తద్వారా ఆర్థిక పునరుద్ధరణకు మద్దతును కొనసాగిస్తుందని భావిస్తున్నాం.  

► వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల వృద్ధి అంచనా 2022–23కి 3.3 శాతం.  పరిశ్రమలు,  సేవల రంగాల వరుసగా 5.9 శాతం, 8.5 శాతం వృద్ధి చెందుతాయని అంచనా. 

► కోవిడ్‌–19 మహమ్మారి నుండి ముప్పు ఇంకా పొంచి ఉండగానే, రష్యా–ఉక్రెయిన్‌ వివాదం కొనసాగుతుండడం ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు తీవ్ర సవాలును విసురుతోంది.  

► రష్యా– ఉక్రెయిన్‌లు క్రూడ్‌సహా కీలక ఉత్పత్తులకు ప్రపంచ సరఫరాదారులుగా ఉన్నందున,  అంతర్జాతీయ స్థాయిలో కమోడిటీల ధరలు తీవ్రమవుతున్నాయి. ఇది ప్రపంచానికి తీవ్ర సవాలు. ఈ వివాదం ఎక్కువ కాలం కొనసాగితే ముడి చమురు, సహజ వాయువు, ఆహారం, ఎరువులు, లోహాలతో సహా ప్రధాన ముడి పదార్థాల సరఫరాను మరింత దెబ్బతీస్తుంది. 

► 2022 ప్రథమార్థంలో ప్రపంచ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు.  ఆ తర్వాత తగ్గుతూ మధ్యస్థానికి చేరుకోవచ్చని సర్వేలో పాల్గొన్న ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. 

► పరిశ్రమలు, బ్యాంకింగ్, ఆర్థిక సేవల వంటి రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థికవేత్తల నుండి మార్చిలో స్వీకరించిన అభిప్రాయాల ఆధారంగా ఎకనామిక్‌ అవుట్‌లుక్‌ సర్వేను ఫిక్కీ రూపొందించింది. 2021–22 చివరి త్రైమాసికం (జనవరి–మార్చి), 2022–23 ఆర్థిక సంవత్సరం ఒకటవ త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌) ఆర్థిక అంచనాలపై సర్వే దృష్టి పెట్టింది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top