ముంబై: దేశీయంగా మూడో వంతు జనాభా డిజిటల్ చెల్లింపులకు మళ్లితేనే నగదు వినియోగం తగ్గుతుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఎండీ, సీఈవో దిలీప్ అస్బే తెలిపారు. ప్రస్తుతం ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) వంటి సర్వీసులను జనాభాలో దాదాపు అయిదో వంతు ప్రజలే వినియోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే తీరు కొనసాగితే చలామణీలో ఉన్న నగదు పరిమాణం చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గడానికి 12–18 నెలలు పట్టొచ్చని దిలీప్ చెప్పారు.
కొన్నాళ్లుగా ఇటు డిజిటల్ చెల్లింపులు అటు చలామణీలో ఉన్న నగదు (సీఐసీ) పరిమాణం ఒకే తరహాలో పెరుగుతుండటం ఒక పజిల్‌గా మారిన నేపథ్యంలో దిలీప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో 2016లో స్థూల దేశీయోత్పత్తిలో సీఐసీ 12 శాతంగా ఉండగా .. ప్రస్తుతం ఇది 14 శాతానికి పెరిగింది. సంపన్న దేశాల్లో ఇది సింగిల్ డిజిట్ స్థాయిలోనే ఉంటోంది. దేశీయంగా చిత్రమైన పరిస్థితి నెలకొనడంపై దిలీప్ వివరణ ఇచ్చారు.
నగదు బదిలీ స్కీముల వంటి పథకాల సొమ్ము నేరుగా ప్రజల ఖాతాల్లోనే జమ అవుతున్నప్పటికీ వారు డిజిటల్ చెల్లింపులను ఎంచుకోకుండా .. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకుని వాడుకుంటుండటం కూడా సీఐసీ పెరగడానికి ఒక కారణమని ఆయన తెలిపారు. మరోవైపు, భవిష్యత్తులో భారతీయులు రోజుకు వంద కోట్ల పైగా డిజిటల్ చెల్లింపు లావాదేవీలు నిర్వహిస్తారని దిలీప్ చెప్పారు. మరికొద్ది నెలల్లో రూపే క్రెడిట్ కార్డులను యూపీఐ ప్లాట్‌ఫాంనకు అనుసంధానించనున్నట్లు వివరించారు. దీనిపై ఎస్‌బీఐ కార్డ్స్, బీవోబీ కార్డ్స్, యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ మొదలైన వాటితో చర్చలు జరుగుతున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment