
సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలు సుమారు రూ.7,800 కోట్లు చెల్లించాలని కోరుతూ టాటా కమ్యూనికేషన్స్‌కు టెలికాం విభాగం (DoT) షోకాజ్ కమ్ డిమాండ్ నోటీసు జారీ చేసింది. ఇవి 2005-06 నుంచి 2023-24 మధ్య కాలానికి సంబంధించిన ఏజీఆర్ బకాయిలుగా డిమాండ్ నోటీసులో పేర్కొంది.
‘2005-06 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.7,827.55 కోట్ల షోకాజ్ కమ్ డిమాండ్ నోటీసులు భారత టెలికమ్యూనికేషన్స్ విభాగం నుంచి జూన్ 30, 2005 నాడు అందాయి’ అని టాటా కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్ లక్ష్మీనారాయణ్ తెలిపారు. ఇందులో ఐఎస్పీ (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్) లైసెన్స్ కింద 2010-11 ఆర్థిక సంవత్సరానికి, ఎన్ఎల్‌డీ (నేషనల్ లాంగ్ డిస్టెన్స్) లైసెన్స్ కింద 2007, 2010 ఆర్థిక సంవత్సాలకు కంపెనీ క్లెయిమ్ చేసిన మినహాయింపులు రూ .276.68 కోట్లను కూడా పేర్కొన్నట్లు ఆయన చెప్పారు.
అయితే ఐఎల్‌డీ (ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్), ఎన్‌ఎల్‌డీ, ఐఎస్‌పీ లైసెన్సులకు సంబంధించి టాటా కమ్యూనికేషన్స్ గతంలో దాఖలు చేసిన అప్పీళ్లు సుప్రీంకోర్టు, టెలికాం ట్రిబ్యునల్ టీడీఎస్ఏటీ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. పాత టెలికాం లైసెన్స్ విధానం యూఏఎస్ఎల్ కింద ఏజీఆర్పై 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కంపెనీ అప్పీళ్లను ప్రస్తావించలేదని లక్ష్మీనారాయణ్ తెలిపారు. కాబట్టి తమ లైసెన్సులు యూఏఎస్ఎల్కి భిన్నమని కంపెనీ భావిస్తోందని, స్వతంత్ర న్యాయ అభిప్రాయాల ఆధారంగా తన స్థానాన్ని సమర్థించుకోగలదని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.