ప్రపంచ ప్రఖ్యాత పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి బంగారం, వెండిపై తన మద్దతును వ్యక్తం చేశారు. సంపదను కాపాడుకోవాలంటే బంగారం వంటి వాస్తవ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచించారు.
తాజాగా ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టులో, చాలామంది బంగారం కొంటే డబ్బు సంపాదించవచ్చని భావిస్తారని, కానీ ధనవంతులు ఆ ఉద్దేశంతో బంగారం కొనరని పేర్కొన్నారు. డాలర్‌పై నమ్మకం లేకపోవడమే బంగారం కొనడానికి ప్రధాన కారణమని ఆయన అన్నారు. తన వయోజన జీవితమంతా బంగారం, వెండి నిల్వ చేసుకుంటూ వచ్చానని, వాటి ధరలు భారీగా పెరుగుతాయని ఆశించి కాదు, డాలర్ విలువ కాలక్రమేణా తగ్గుతుందనే అవగాహనతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు.
ప్రభుత్వాలు కొత్త కరెన్సీని ముద్రించిన ప్రతిసారీ నగదు కొనుగోలు శక్తి తగ్గిపోతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు. బంగారం లాభాలను హామీ ఇవ్వదని, కానీ సంపదను రక్షించే సాధనంగా పనిచేస్తుందని చెప్పారు. కోట్లాది రూపాయలు అవసరం లేదని, ఒక వెండి నాణెం లేదా చిన్న పరిమాణంలో బంగారం కొనుగోలు చేయడం ద్వారా కూడా సంపద రక్షణను ప్రారంభించవచ్చని సూచించారు.
అయితే ఎక్కువ మంది ప్రజలు సోషల్ మీడియాలో సమయం గడపడం, తదుపరి స్టాక్ టిప్ కోసం ఎదురు చూడడం లేదా ప్రభుత్వమే తమను కాపాడుతుందని ఆశించడం చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. నిజమైన డబ్బు బంగారం, వెండి వంటి విలువైన లోహాలేనని, కాగితపు కరెన్సీ కేవలం నకిలీ డబ్బు లాంటిదేనని ఆయన పేర్కొన్నారు.
వేల ఏళ్లుగా బంగారం, వెండి సంపద నిల్వ సాధనాలుగా కొనసాగుతున్నాయని, కానీ అమెరికా డాలర్ 1971 నుంచి క్రమంగా విలువ కోల్పోతోందని కియోసాకి అన్నారు. ప్రభుత్వాలపై నమ్మకం ఉంచాలా, లేక బంగారంపై విశ్వాసం పెంచుకోవాలా అనేది ప్రతి వ్యక్తి తీసుకోవాల్సిన నిర్ణయమని తన పోస్టులో పేర్కొన్నారు.


