
బ్యాంకు లోన్ ఇస్తే మనం ఈఎంఐ చెల్లించడం ఆనవాయితి. అయితే అందుకు పూర్తి భిన్నంగా బ్యాంకే మనకు డబ్బు చెల్లిస్తే.. అవును.. ఈ ఊహ ఎంత బావుందో కదా.. అయితే అందుకు మన ప్రాపర్టీని బ్యాంకు వద్ద తనఖా పెట్టాల్సి ఉంటుంది. దాంతో ప్రతినెల లేదా ఒకేసారి పెద్ద మొత్తంలో బ్యాంకు ద్వారా డబ్బు పొందవచ్చు. ఆ వివరాలు కింద చూద్దాం.
సీనియర్ సిటిజన్ల (వృద్ధుల) కోసం బ్యాంకుల్లో కొన్ని ప్రత్యేక లోన్లు ఉంటాయి. సాధారణంగా హోమ్ లోన్‌లో రుణగ్రహీత బ్యాంకుకు ఈఎంఐలు చెల్లిస్తే రివర్స్ మార్టగేజ్ లోన్‌లో బ్యాంకులే సీనియర్ సిటిజన్‌కు క్రమానుగతంగా లేదా ఒకేసారి కొంత మొత్తాన్ని చెల్లిస్తాయి. దీనికి బదులుగా సీనియర్ సిటిజన్ తమ స్థిరాస్తులను బ్యాంకులో తాకట్టు (Mortgage) పెట్టాల్సి ఉంటుంది.
రివర్స్ మార్టగేజ్ లోన్లు అంటే ఏమిటి?
తమ సొంత ఇంట్లో ఉంటూనే ఆర్థిక అవసరాల కోసం తమ ఆస్తిపై ఉన్న విలువను నగదు రూపంలో పొందేందుకు ఈ లోన్లు వృద్ధులకు సహాయపడతాయి. ముఖ్యంగా స్థిరమైన ఆదాయం లేని వారికి ఈ లోన్ ఒక మంచి ఆదాయ మార్గంగా ఉపయోగపడుతుంది. లోన్ తీసుకున్న వ్యక్తి (రుణగ్రహీత) జీవించి ఉన్నంత కాలం లేదా ఇంట్లో నివసిస్తున్నంత వరకు లోన్ తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు.
వాటిని బ్యాంకులు ఎలా జారీ చేస్తాయి?
షెడ్యూల్డ్ బ్యాంకులు, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) వద్ద నమోదైన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (HFCలు) ఈ రుణాలను అందిస్తాయి.
వృద్ధులు తమ నివాస ఆస్తిని బ్యాంకులో తాకట్టు పెడతారు.
బ్యాంక్ ఆ ఆస్తి విలువను అంచనా వేస్తుంది. రుణగ్రహీత వయసు, ఆస్తి విలువ, వడ్డీ రేటు ఆధారంగా ఎంత లోన్ ఇవ్వవచ్చో నిర్ణయిస్తుంది.
మంజూరైన లోన్ మొత్తాన్ని రుణగ్రహీతకు నిర్ణీత పద్ధతిలో చెల్లిస్తారు.
నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక వాయిదాలుగా చెల్లిస్తారు. (సాధారణంగా గరిష్ఠ నెలవారీ చెల్లింపు పరిమితి రూ.50,000 వరకు ఉంటుంది).
లోన్ మొత్తంలో కొంత భాగాన్ని ఒకేసారి కూడా తీసుకోవచ్చు (సాధారణంగా 50% వరకు).
ఈ లోన్‌ను రుణగ్రహీత జీవించి ఉన్నంత కాలం చెల్లించాల్సిన అవసరం లేదు. చివరి రుణగ్రహీత మరణించిన తర్వాత లోన్ అసలు, దానిపై పేరుకుపోయిన వడ్డీ మొత్తం చెల్లించవలసి వస్తుంది. వారసులు ఈ మొత్తాన్ని చెల్లించి ఆస్తిని తిరిగి తీసుకోవచ్చు లేదా ఆస్తిని అమ్మి లోన్‌ను సెటిల్ చేయవచ్చు.
ఈ లోన్ పొందేందుకు అర్హతలేమిటి?
సాధారణంగా రివర్స్ మార్టగేజ్ లోన్ పొందడానికి కింది అర్హతలు అవసరం అవుతాయి.
వయసు: దరఖాస్తుదారు భారతీయ పౌరుడై ఉండాలి. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి.
ఉమ్మడి రుణం: వివాహిత జంటల విషయంలో ఒకరు 60 ఏళ్లు పైబడినవారు, మరొకరు 55 ఏళ్ల కంటే తక్కువ కాకుండా ఉంటే ఉమ్మడి రుణగ్రహీతలుగా అర్హులు.
ఆస్తి యాజమాన్యం: ఆస్తికి సంబంధించిన స్పష్టమైన టైటిల్ (Clear Title) ఉండాలి. అది ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండాలి.
ఆస్తి రకం: అది స్వయం-ఆర్జితం (Self-acquired) లేదా వారసత్వంగా వచ్చిన నివాస ఆస్తి (ఇల్లు లేదా ఫ్లాట్) అయ్యి ఉండాలి.
నివాసం: ఆ ఆస్తిని రుణగ్రహీత ప్రాథమిక నివాసంగా ఉపయోగించాలి.
బ్యాంకులకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?
ఆస్తిని తాకట్టు పెట్టుకోవడం ద్వారా బ్యాంకుకు అధిక భద్రత (Security) లభిస్తుంది. రుణగ్రహీత తిరిగి చెల్లించలేకపోయినా ఆస్తిని అమ్మి లోన్‌ను వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు సేవ చేయడం ద్వారా కొత్త మార్కెట్‌ను చేరుకోగలుగుతారు. ఈ లోన్‌పై వడ్డీ కాలక్రమేణా పెరుగుతూ పోతుంది. రుణ వ్యవధి ముగిసిన తర్వాత లేదా వారసులు ఆస్తిని అమ్మినప్పుడు ఈ వడ్డీతో సహా అసలు మొత్తాన్ని బ్యాంకు పొందుతుంది.
కస్టమర్లకు ఎలాంటి లాభాలున్నాయి?
రుణగ్రహీత తమ ఇంట్లోనే జీవించే హక్కును కలిగి ఉంటారు. లోన్ తీసుకున్నంత మాత్రాన ఆస్తి యాజమాన్యం పోదు. స్థిరమైన ఆదాయ వనరులు లేని వృద్ధులకు క్రమం తప్పకుండా ఆదాయం లభిస్తుంది. ఇది వారి రోజువారీ ఖర్చులకు, వైద్య అవసరాలకు, ఇంటి మరమ్మతులకు ఉపయోగపడుతుంది. రుణగ్రహీత జీవించి ఉన్నంత కాలం నెలవారీగా లోన్‌ను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.
పన్ను ప్రయోజనాలు
రివర్స్ మార్టగేజ్ ద్వారా పొందిన డబ్బును ఆదాయంగా పరిగణించరు. కాబట్టి దానిపై సాధారణంగా ఆదాయపు పన్ను ఉండదు (అయితే తాకట్టు పెట్టిన ఆస్తిని బ్యాంక్ అమ్మి లోన్ రికవరీ చేసుకునే సమయంలో మూలధన లాభాల పన్ను (Capital Gains Tax) వర్తించవచ్చు). రుణగ్రహీత లేదా వారి వారసులు ఎప్పుడైనా లోన్‌ను ముందుగానే చెల్లించవచ్చు. చాలా బ్యాంకులు ముందస్తు చెల్లింపుకు పెనాల్టీ విధించవు.
బ్యాంకులు పాటిస్తున్న నియమాలు..
భారతదేశంలో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ఈ లోన్‌లను అందిస్తాయి. ఇందులో గరిష్ఠ లోన్ చెల్లింపు వ్యవధి 20 సంవత్సరాలు మించకూడదు. రుణగ్రహీత ఆస్తి విలువ తగ్గకుండా దాన్ని మంచి స్థితిలో ఉంచాలి. ఆస్తి పన్నులు (Property Taxes), ఇంటి బీమా (Home Insurance) ప్రీమియంలను రుణగ్రహీత క్రమం తప్పకుండా చెల్లించాలి. బ్యాంక్ కనీసం ప్రతి ఐదేళ్లకోసారి ఆస్తి విలువను తిరిగి అంచనా వేయవచ్చు లేదా లోన్ మొత్తాన్ని సవరించవచ్చు. రుణగ్రహీత మరణించిన తర్వాత లేదా శాశ్వతంగా ఆస్తిని విడిచిపెట్టిన తర్వాత ఆరు నెలల్లోపు లోన్ మొత్తం చెల్లించాలి. రుణగ్రహీత ఆస్తి పన్నులు లేదా బీమాను చెల్లించడంలో విఫలమైతే లేదా నిరంతరంగా ఒక సంవత్సరం కంటే ఎక్కువకాలం ఇంట్లో నివసించకపోతే బ్యాంకు లోన్‌ను రద్దు (Foreclosure) చేయవచ్చు.
ఇదీ చదవండి: బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..