కోవిడ్ బాధిత ఉద్యోగి కుటుంబాలకు రిలయన్స్​ భారీ సాయం

Reliance Foundation Financial Support For Covid19 Deceased Employees - Sakshi

కరోనా కష్టకాలం.. రిలయన్స్​​ ఔదార్యం

కరోనా కష్టకాలంలో తమ ఉద్యోగులను ఆదుకునేందుకు రిలయన్స్​ గ్రూప్​ ఆఫ్​ ఇండస్ట్రీస్​ మంచి నిర్ణయం తీసుకుంది.  కొవిడ్​తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఐదేళ్లపాటు ఆర్థికసాయం అందించేందుకు ముందుకొచ్చింది. అంతేకాదు వాళ్ల పిల్లల చదువుల బాధ్యతలను కూడా తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో రిలయన్స్​ ఫౌండేషన్​ తెలిపింది. 

ముంబై:  ఉద్యోగుల సామాజిక భద్రత కోసం రిలయన్స్​ ఒక అడుగు ముందుకేసింది. COVID-19 తో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబానికి 5 సంవత్సరాలు పూర్తి వేతనం ఇవ్వడంతో పాటు వారి  పిల్లలకు విద్య  అందించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. అలాగే ఆఫ్​ రోల్స్​ ఎంప్లాయిల కుటుంబాలకు పదిలక్షల సాయం అందించాలని నిర్ణయించినట్లు చెబుతోంది.

అలాగే సాయం అందించే విషయంలో బాధిత కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని, సాయం త్వరగతిన అందుతుందని హామీ ఇచ్చింది. ఈ మేరకు కొన్ని జాతీయ వెబ్​సైట్స్ ఈ సాయం గురించి ప్రముఖంగా కథనాలు ప్రచురించాయి. కాగా, తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో #WeappreciateReliance, #thanxReliance హ్యాష్​ ట్యాగులతో రిలయన్స్​ నిర్ణయాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు.    

కోవిడ్ లీవులు.. సాయం
ఇక కోవిడ్ బారిన పడ్డ ఎంప్లాయిస్​, వాళ్ల కుటుంబాలు పూర్తిగా కోలుకునేంతవరకు జీతాలతో కూడిన సెలవుల్ని రిలయన్స్​  మంజూరు చేసింది. అలాగే కరోనాతో చనిపోయిన ఉద్యోగి భార్య, పేరెంట్స్, పిల్లల ఆస్పత్రి ఖర్చుల కోసం 100 శాతం ప్రీమియం చెల్లింపును రిలయన్సే భరించాలని నిర్ణయించుకుంది. ఇక చనిపోయిన ఉద్యోగి పిల్లలందరికీ గ్రాడ్యుయేషన్​ వరకు దేశంలో ఏ ఇనిస్టిట్యూట్‌లోనైనా 100 శాతం ట్యూషన్ ఫీజు, హాస్టల్ సౌకర్యానికి అవసరమయ్యే ఖర్చులనూ రిలయన్స్ ఫౌండేషన్ అందించబోతోంది. ‘‘మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయి. పోరాట పటిమను ఆపొద్దు. అందరం కలిసి కట్టుగా పోరాడదాం. మంచి రోజులు వచ్చేవరకు మన తోటి ఉద్యోగుల కుటుంబాలకు అవసరమైన ధైర్యం అందాలని ఆ దేవుడ్ని ప్రార్థిద్దాం. చేయూత నిద్దాం. జాగ్రత్తగా ఉండడండి’ అంటూ రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ తన ప్రకటన రిలీజ్ చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top