
6–7 త్రైమాసికాలుగా ఇదే పరిస్థితి
క్వెస్‌కార్ప్ ఈడీ, సీఈవో గురుప్రసాద్
న్యూఢిల్లీ: ఒకప్పుడు ఉపాధి అడ్డాగా ఒక వెలుగు వెలిగిన ఐటీ రంగంలో స్తబ్దత నెలకొంది. ఏఐ తదితర అత్యాధునిక టెక్నాలజీలు రావడంతో కంపెనీలు నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. గత ఆరేడు త్రైమాసికాలుగా ఐటీ సేవల రంగంలో నియామకాలు నిలిచిపోయినట్టు, జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలోనూ నియామకాలు పుంజుకోకపోవచ్చని హైరింగ్ సేవలు అందించే క్వెక్‌కార్ప్ కంపెనీ ఈడీ, సీఈవో గురుప్రసాద్ పేర్కొన్నారు.
గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీలు), నాన్ ఐటీ కంపెనీల నుంచి నియామకాలకు డిమాండ్ కనిపిస్తున్నట్టు చెప్పారు. ‘‘కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు ఎక్కువ డిమాండ్ ఉంది. వేతనం సగటున రూ.1.25 లక్షలుగా ఉంది’’ అని చెప్పారు.
సాధారణ ఉద్యోగుల నియామకాల పరంగా పురోగతి సంకేతాలు కనిపిస్తున్నాయని, జూన్‌లో చురుకైన వాతావరణం నెలకొన్నట్టు తెలిపారు. నిపుణుల నియామకాల పరంగా మెరుగైన వృద్ధి కనిపించినట్టు శ్రీనివాసన్ వెల్లడించారు. జూన్ త్రైమాసికంలో తయారీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, కన్జ్యూమర్ రిటైల్, టెలికం రంగాల నుంచి నియామకాలు ఎక్కువగా జరిగినట్టు తెలిపారు. లిస్టెడ్ కంపెనీ అయిన క్వెస్ కార్ప్ జూన్ త్రైమాసికానికి 4 శాతం వృద్ధితో రూ.51 కోట్ల నికర లాభాన్ని ప్రకటించడం గమనార్హం.