యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం డౌన్‌  | Axis Bank net profit saw a significant drop of 26 percent in the September 2025 | Sakshi
Sakshi News home page

యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం డౌన్‌ 

Oct 16 2025 4:40 AM | Updated on Oct 16 2025 4:40 AM

Axis Bank net profit saw a significant drop of 26 percent in the September 2025

క్యూ2లో రూ. 5,528 కోట్లు 

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యాక్సిస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్‌లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 25 శాతం క్షీణించి రూ. 5,528 కోట్లకు పరిమితమైంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం పంట రుణాలపై రూ. 1,231 కోట్ల ప్రొవిజన్లు చేపట్టడం ప్రభావం చూపింది. స్టాండెలోన్‌ నికర లాభం సైతం 26 శాతం నీరసించి రూ. 5,090 కోట్లకు చేరింది. 

గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 6,918 కోట్లు ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 2 శాతం నామమాత్ర వృద్ధితో రూ. 13,745 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.99 శాతం నుంచి 3.73 శాతానికి బలహీనపడ్డాయి. ట్రేడింగ్‌ ఆదాయం 55 శాతం తగ్గడంతో ఇతర ఆదాయంలోనూ 1 శాతం కోతపడి రూ. 6,625 కోట్లకు పరిమితమైంది. ప్రొవిజన్లు రూ. 2,204 కోట్ల నుంచి రూ. 3,547 కోట్లకు పెరిగాయి. రెండు రకాల పంట రుణ ప్రొడక్టులను నిలిపివేయడం ఇందుకు కారణమైంది. 

10 లక్షల క్రెడిట్‌ కార్డులు: త్రైమాసికవారీగా యాక్సిస్‌ బ్యాంక్‌ స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.57 శాతం నుంచి 1.46 శాతానికి తగ్గాయి. ఈ కాలంలో 10 లక్షల క్రెడిట్‌ కార్డులను విక్రయించింది. కనీస మూలధన నిష్పత్తి 16.55 శాతంగా నమోదైంది. అనుబంధ సంస్థలలో యాక్సిస్‌ ఫైనాన్స్‌ నికర లాభం తొలి అర్ధభాగం(ఏప్రిల్‌–సెప్టెంబర్‌)లో రూ. 327 కోట్ల నుంచి రూ. 385 కోట్లకు బలపడింది. యాక్సిస్‌ ఫైనాన్స్‌ అప్పర్‌లేయర్‌ ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తింపు పొందనున్నట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈవో అమితాబ్‌ చౌదరీ పేర్కొన్నారు. దీంతో లిస్టింగ్‌ చేపట్టవలసి ఉంటుందని తెలియజేశారు.

ఫలితాల నేపథ్యంలో యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు బీఎస్‌ఈలో 0.7 శాతం క్షీణించి రూ. 1,169 వద్ద ముగిసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement