రామప్ప చుట్టూ రియల్‌ జోరు

Realtors Eyeing On Ramappa temple Peripheral Lands And Land Rates Touching The Sky - Sakshi

హాలో సునీల్‌ అన్నా, బాగున్నవా ? నేను శ్రావణ్‌ని మాట్లాడుతున్న.. మన రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చింది కదా.. మన తరఫున అక్కడో వెంచర్‌ వేద్దామని ప్లాన్‌ చేస్తున్నం.. నువ్వే జర మంచి జాగ చూపియ్యాలే.. పైసలెంతైనా పర్వాలేదు. కానీ మనకు ఆడ జాగ కావాలే. నువ్వేంజేస్తవో ఏమో.. నిన్ను కూడా అరుసుకుంట. ఒక్క సునీల్‌కే కాదు రామప్ప ఆలయం కొలువైన పాలంపేట దాని చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజల ఫోన్లు వారం రోజులగా మోగుతూనే ఉన్నాయి. భూముల కోసం ఆరాలు తీస్తునే ఉన్నారు. నిమిషాల లెక్కన అక్కడ భూముల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 

సాక్షి, వెబ్‌డెస్క్‌ : ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కడం ఆలస్యం రామప్పలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే ఊహించని స్థాయికి చేరుకున్నాయి. వరంగల్‌, హైదరాబాద్‌ల నుంచి బడా రియల్టర్లు ఇక్కడ వాలిపోతున్నారు. ధరెంతైనా పర్వాలేదు.. ఇక్కడ మనకో వెంచర్‌ ఉండాలన్నట్టుగా బేరాలకు దిగుతున్నారు. 

యునెస్కో గుర్తింపు
కాకతీయులు ఎనిమిది వందల ఏళ్ల కిందట కట్టించిన రుద్రేశ్వరాలయాలన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా ఇటీవల యునెస్కో గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ గుర్తింపు దక్కించుకున్న తొలి కట్టడంగా రికార్డులెక్కింది. యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత రామప్పగుడిని చూసేందుకు వస్తున్న వారి సంఖ్య పెరగడంతో పాటు ఒక్కసారిగా ఆలయం చుట్టు పక్కల స్థలాల ధరలకు రెక్కలు వచ్చాయి. 

గుర్తింపుతో రెట్టింపు
ఆలయానికి సమీపంలోనే రామప్ప చెరువు ఉంది. సాగునీటి లభ్యత ఉండటంతో ఇక్కడి భూములకు ముందు నుంచి డిమాండ్‌ ఎక్కువ. ఎకరం పొలం సుమారు రూ. 20 లక్షల నుంచి 25 లక్షల వరకు పలికేది. అయితే యునెస్కో గుర్తింపు రావడం ఆలస్యం ఒక్కసారిగా ఎకరం భూమి ధర రూ. 40 లక్షల నుంచి 45 లక్షలకు చేరుకుంది. 

వారం తిరక్కుండానే
యునెస్కో గుర్తింపు రావడం ఆలస్యం వరంగల్‌, హైదరాబాద్‌లకి చెందిన రియల్టర్లు ఇక్కడి స్థలాల కోసం ఆరా తీయడం మొదలు పెట్టారు. తమకే స్థలాలు అమ్మాలంటూ రైతులతో సంప్రదింపులు మొదలెట్టారు. దీంతో రియల్టర్ల మధ్య నెలకొన్న పోటీతో వారం తిరిగే సరికి ఇక్కడ ఎకరం భూమి ధర రూ. 60 లక్షల నుంచి 65 లక్షలకు చేరుకుంది.

ఇక్కడే డిమాండ్‌
రామప్ప దేవాలయం ములుగు జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్లు, వరంగల్‌ నగరం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో ఉంది. వరంగల్‌ - భూపాలపట్నం జాతీయ రహదారి 163లో జంగాలపల్లి క్రాస్‌రోడ్డు నుంచి రామప్ప ఆలయం వరకు ఉన్న 10 కిలోమీటర్ల పరిధిలోని భూములకు ప్రస్తుతం ఫుల్‌ డిమాండ్‌ ఉంది. ఒకరి తర్వాత ఒకరుగా రియల్టర్లు ఆఫర్లు ఇస్తుండటంతో ఇక్కడి రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొందరు అగ్రిమెంట్లు చేసుకునేందుకు సిద్ధమవుతుండగా మరికొందరు మరింత రేటు పెరుగుతుందేమో అని వేచి చేసే ధోరణిలో ఉన్నారు.

యాదగిరిగుట్ట

యాదాద్రి తర్వాత
తెలంగాణ ఏర్పడిన తర్వా యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మరుక్షణం భువనగిరి-యాదగిరిగుట్ట-ఆలేరు రోడ్డులో భూముల ధరకు రెక్కలు వచ్చాయి. నెలల వ్యవధిలోనే వందల కొద్ది వెంచర్లు వెలిశాయి. ప్రమోటర్లను పెట్టుకుని లే అవుట్‌ పూర్తికాకముందే ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఇంచుమించు అదే పరిస్థితి రామప్ప దగ్గరా కనిపిస్తోంది. ఇక్కడ వెంచర్లు వేసేందుకు రియల్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు.

భద్రాకాళి ఆలయం

పర్యాటక కేంద్రం
తెలంగాణలో హైదరాబాద్‌ని మినహాయిస్తే అతి పెద్ద పర్యాటక కేంద్రంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా నిలుస్తోంది. వరంగల్‌లో వేయిస్థంభాలగుడి, భద్రాకాళి, ఖిలావరంగల్‌ మొదలు రామప్ప ఆలయం, సమ్మక్క సారలమ్మ మేడారం, లక్నవరం, పాకాల, బొగత జలపాతం, మల్లూరు నరసింహస్వామి, కాళేశ్వరం, పాండవులగుట్ట, ఘణపురం కోటగుళ్లు, ఏటూరునాగారం అభయారణ్యం, తాడ్వాయి ఏకో టూరిజం, ప్రాచీన కాలానికి చెందిన డోల్మన్‌ సమాధాలు వంటి ఆథ్యాత్మిక పర్యాటక, ప్రకృతి రమణీయ ప్రాంతాలు వరుసగా ఉన్నాయి. ఆదివారం వస్తే పర్యాటకుల వాహనాలు వరంగల్‌ - ఏటూరునాగారం రోడ్డులో బారులు తీరుతాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో టూరిజం సర్క్యూట్‌ని అభివృద్ధి చేస్తున్నాయి. 

బొగత జలపాతం

ఢోకాలేదు
తాజాగా యునెస్కో గుర్తింపు రావడంతో రామప్ప ఆలయ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రణాళికను రూపొందించాయి. ఇప్పటికే పాలంపేట ప్రాథికార సంస్థ ఏర్పాటును చేశారు. మరోవైపు త్వరలోనే వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వరంల్‌ టూరిజం సర్క్యూట్‌లో అటు బొగత జలపాతం ఇటు వరంగల్‌ నగరానికి నట్టనడుమ రామప్ప కొలువై ఉంది. దీంతో పర్యాటకుల సంఖ్య మరింతగా పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు లేవు. దీంతో రామప్ప దగ్గర పెట్టుబడికి ఢోకా లేదనే నమ్మకం రియల్టర్లలో నెలకొంది.  

హోటళ్లు రిసార్టులు
రామప్ప దగ్గర భూములు కొనేందుకు రియల్టర్లతో పాటు బడా కంపెనీలు సైతం ఆసక్తి చూపిస్తున్నాయి. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా రామప్ప సమీపంలో హోటళ్లు, రిసార్టులు కట్టేందుకు సుముఖంగా ఉన్నాయి. హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి అనువుగా ఉండే స్థలం కోసం అన్వేషణ చేస్తున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top