
బంగారం, గృహం, స్టాక్ మార్కెట్.. ఈ మూడింట్లో ఎందులో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారని మహిళలను అడిగితే.. ఠక్కున చెప్పే సమాధానం బంగారమే! కానీ, నేటి మహిళల పెట్టుబడి ఆలోచనల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. మొదట సొంతిల్లు.. ఆ తర్వాతే బంగారం, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ అంటున్నారు. 69 శాతం మంది మహిళలు సొంత ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా.. 31 శాతం మంది పెట్టుబడి కోసం ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారని అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే వెల్లడించింది.
– సాక్షి, సిటీబ్యూరో
మన దేశంలో గృహ కొనుగోలు ప్రక్రియలో మహిళలు ఎల్లప్పుడూ కీలక నిర్ణయాధికారులే. మహిళలు స్వతంత్ర, వ్యక్తిగత ఆస్తుల కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాపర్టీ కొనుగోళ్లలో మెజారిటీ మహిళలు తుది వినియోగదారులే. పెట్టుబడి రీత్యా ఆస్తుల కొనుగోళ్లూ ఆశించిన స్థాయిలోనే ఉండటం గమనార్హం. పెరుగుతున్న స్వాతంత్య్రం, వ్యక్తిగత స్వేచ్ఛ, నిర్ణయాధికారం, మెరుగైన ఆదాయ వనరులు కారణంగా గృహ విభాగంలో మహిళా పెట్టుబడిదారులు ఎక్కువగా వస్తున్నారు. 2022 హెచ్2 (జులై–డిసెంబర్)లో మహిళా గృహ కొనుగోలుదారుల్లో తుది వినియోగం: పెట్టుబడి నిష్పత్తి 79:21గా ఉండగా.. 2024 హెచ్2 నాటికి 69:31గా ఉందని తెలిపింది.
లాంచింగ్ ప్రాజెక్టుల్లోనే..
సర్వేలో పాల్గొన్న 69 శాతం మహిళలకు రియల్ ఎస్టేట్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆస్తి తరగతిగా భావిస్తున్నారు. 2022 హెచ్2లో ఇది 65 శాతంగా ఉండగా.. కోవిడ్ కంటే ముందు 2019 హెచ్2లో 57 శాతంగా ఉంది. గతంలో కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకు 10 శాతం మంది మహిళలు మొగ్గుచూపగా.. ఇప్పుడది 18 శాతానికి పెరిగింది. నిర్మాణం పూర్తయి, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు (రెడీ టు మూవ్) కొనుగోళ్ల ప్రాధాన్యత 29 శాతం మేర తగ్గింది.
లగ్జరీకే మొగ్గు..
లగ్జరీ ప్రాపర్టీలకు మహిళలూ ఆసక్తి చూపిస్తున్నారు. రూ.90 లక్షల కంటే ఎక్కువ ధర ఉండే ప్రీమియం ఇళ్ల కొనుగోళ్లకు 52 శాతం ఉమెన్స్ మొగ్గు చూపిస్తున్నారు. వీటిలో 33 శాతం మంది రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల ధర ఉండే ప్రాపర్టీలను ఇష్టపడుతుండగా.. 11 శాతం మంది రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల ధర ఉండే గృహాలను, 8 శాతం మంది రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలో మహిళా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్‌ఎన్‌ఐ) పెరుగుదలకు ఇదే నిదర్శనం.
గోల్డ్, స్టాక్ మార్కెట్..
ప్రాపర్టీ తర్వాత మగువలకు అమితాసక్తి బంగారమే. అందుకే రియల్ ఎస్టేట్ తర్వాత గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కే మహిళలు జై కొడుతున్నారు. 2022 హెచ్2లో బంగారంలో పెట్టుబడులకు 8 శాతం మంది మహిళలు ఆసక్తి చూపించగా.. 2024 హెచ్2 నాటికి 12 శాతానికి పెరిగింది. ఇక, ఏటేటా స్టాక్ మార్కెట్ ఆకర్షణ కోల్పోతుంది. రెండేళ్ల క్రితం మార్కెట్‌లో పెట్టుబడులకు 20 శాతం మంది మహిళలు ఆసక్తి చూపిస్తే.. ఇప్పుడది ఏకంగా 2 శాతానికి పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment