రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం మంచిదేనా?

Is Real Estate A Good Investment In Future - Sakshi

ఫ్లెక్సీక్యాప్, లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌.. ఒకేసారి, ఒకటికి మించిన ఫండ్‌ విభాగాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చా?– వెంకటరమణ 

మీరు సంక్లిష్టతను ఇష్టపడే వారు అయితే ఒకటికి మించిన విభాగాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. కాకపోతే నిర్ణీత కాలానికి ఒకసారి పోర్ట్‌ఫోలియోని రీబ్యాలన్స్‌ (సమీక్ష/మార్పులు, చేర్పులు) చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా ఎన్నో విభాగాల మధ్య పెట్టుబడులను వర్గీకరించినప్పుడు అది గజిబిజీగా, పన్ను పరంగా అనుకూలం కాకపోవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. ఎందుకంటే ఈ పథకాలు వివిధ మార్కెట్‌ విలువ కలిగిన కంపెనీల్లో (స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌) ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. కాకపోతే ఆయా విభాగాలకు కేటాయించే మొత్తం పథకాలను బట్టి వేర్వేరుగా ఉండొచ్చు.

 సాధారణంగా ఫ్లెక్సీక్యాప్‌ పథకాలు తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో 70–75 శాతాన్ని లార్జ్‌క్యాప్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. మిగిలిన పెట్టుడులను మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ పథకాలకు కేటాయిస్తుంటాయి. కనుక మీరు రెండు నుంచి మూడు ఫ్లెక్సీక్యాప్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఫ్లెక్సీక్యాప్‌ పథకాలు ఎక్కువ మొత్తాన్ని లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. కనుక మీరు విడిగా లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు. పెట్టుబడుల విషయంలో మరింత దూకుడుగా, రిస్క్‌ తీసుకునే వారు, ఫ్లెక్సీక్యాప్‌నకు అదనంగా 10–15 శాతం పెట్టుబడులను మిడ్, స్మాల్‌క్యాప్‌నకు కేటాయించుకోవడం ద్వారా దీర్ఘకాలంలో అధిక రాబడులు సొంతం చేసుకోవచ్చు.  

పెట్టుబడికి రియల్‌ ఎస్టేట్‌ మెరుగైన సాధనమేనా? ఇతర ఉత్పత్తులతో దీన్ని ఎలా పోల్చి చూడాలి? – శివమ్‌ 

రియల్‌ ఎస్టేట్‌ను పెట్టుబడి సాధనంగా నేను భావించడం లేదు. ఇల్లును ఒక కుటుంబం నివసించేందుకే గానీ, పెట్టుబడిగా చూడకూడదు. ఒక్కసారి ఇల్లు కొనుగోలు చేసి, దానిలో నివసిస్తుంటే విలువ పెరుగుతుందా? లేక తగ్గుతుందా అన్నది పట్టించుకునే విషయం కాదు. పెట్టుబడిగా రియల్‌ ఎస్టేట్‌కు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. పెట్టుబడి పరిమాణం అధికంగా కావాల్సి ఉంటుంది. ఇతర సాధనాలతో పోలిస్తే లిక్విడిటీ (నగదుగా మార్చుకునే సౌలభ్యం) తక్కువగా ఉంటుంది. దీంతో కోరుకున్నప్పుడు విక్రయించుకునే వీలు ఉండకపోవచ్చు.

 కొన్ని సందర్భాల్లో రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడిలో సవాళ్లూ ఉంటాయి. మరో కోణం నుంచి చూస్తే..  ప్రాపర్టీని అద్దెకు ఇస్తే క్రమం తప్పకుండా అద్దె రూపంలో ఆదాయం వస్తుంది. కిరాయిదారు రూపంలో ఇంటి నిర్వహణ సక్రమంగా ఉండొచ్చు. అలా చూస్తే  ఇల్లు మంచి పెట్టుబడే అవుతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణంతోపాటే అద్దె కూడా పెరుగుతూ వెళుతుంది. అదే సమయంలో ప్రతికూలతలూ కనిపిస్తాయి. ఇల్లు ఎంత గొప్పది అయినా 20 ఏళ్ల తర్వాత డిమాండ్‌ తగ్గుతుంది. అద్దెకు ఉండేవారు అధునికమైన, కొత్త ఇంటి కోసం ప్రాధాన్యం ఇస్తుంటారు. కనుక రియల్‌ ఎస్టేట్‌ విలువ పెరిగినా కానీ, దానికి అనుగుణంగా అద్దె రాబడి మెరుగ్గా ఉండదు. అందుకే ప్రాపర్టీని కొనుగోలు చేసే ముందు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. నా సలహా ఏమిటంటే రియల్‌ ఎస్టేట్‌ను పెట్టుబడిగా కాకుండా నివాసంగానే చూడండి.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top