స్వీయ నియంత్రణ సంస్థ ఏర్పాటు అవశ్యం | Sakshi
Sakshi News home page

స్వీయ నియంత్రణ సంస్థ ఏర్పాటు అవశ్యం

Published Thu, Sep 7 2023 5:10 AM

RBI urges fintech firms to set up self-regulatory body soon says Shaktikanta Das - Sakshi

ముంబై: ఫిన్‌టెక్‌ (ఫైనాన్షియల్‌ టెక్నాలజీ) కంపెనీలు పరిశ్రమ క్రమమైన వృద్ధి కోసం స్వీయ నియంత్రణా సంస్థ (ఎస్‌ఆర్‌ఓ– సెల్ఫ్‌ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్‌)ను ఏర్పాటు చేసుకోవావాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ విజ్ఞప్తి చేశారు. ‘‘ఫిన్‌టెక్‌ ప్లేయర్‌లు దేశీయ చట్టాలకు అనుగుణంగా తమ పరిశ్రమలో చక్కటి నియమ నంబంధనావళిని ఏర్పరచుకోవాలి.

గోప్యత, డేటా రక్షణ నిబంధనలను పటిష్టం చేసుకోవాలి’’ అని  దాస్‌ పేర్కొన్నారు. దీనితోపాటు నైతిక వ్యాపార పద్ధతులను అనుసరించడం, ధరలో పారదర్శకత పాటించడం,  ప్రమాణాలను పెంపొందించడం కీలకమని, దీనికి ఫిన్‌టెక్‌ సంస్థలు తమ వంతు కృషి చేయాలని ఇక్కడ జరుగుతున్న గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫీస్ట్‌ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఏదైనా కంపెనీ ముఖ్యంగా ఫిన్‌టెక్‌ ప్లేయర్‌ల మన్నికైన, దీర్ఘకాలిక విజయానికి సుపరిపాలన నిబంధనావళి కీలకమైన అంశమని అన్నారు. ఫిన్‌టెక్‌ రంగ ఆదాయాలు 2030 నాటికి 200 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటాయన్న అంచనాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సీబీడీసీ పురోగతి
సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీపై (సీబీడీసీ) పురోగతి గురించి దాస్‌ మాట్లాడుతూ,  పైలట్‌ ప్రాజెక్ట్‌ అమలు సందర్భంగా తలెత్తుతున్న సమస్యల పరిష్కారం జరుగుతోందని తెలిపారు. సీబీడీసీ రిటైల్‌ పైలట్‌ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం 26 నగరాల్లోని 13 బ్యాంకుల ద్వారా నిర్వహించడం జరుగుతోందన్నారు. 2023 ఆగస్టు 31 నాటికి దాదాపు 1.46 మిలియన్ల వినియోగదారులు, 0.31 మిలియన్ల వ్యాపారులు ప్రస్తుతం పైలట్‌లో భాగమయ్యారని దాస్‌ తెలిపారు.

యూపీఐ క్యూఆర్‌ కోడ్‌లతో సీబీడీసీ పూర్తి ఇంటర్‌–ఆపరేబిలిటీని కూడా ఆర్‌బీఐ  ప్రారంభించినట్లు తెలిపారు. 2023 డిసెంబర్‌ నాటికి రోజుకు 10 లక్షల సీబీడీసీ లావాదేవీలను లక్ష్యంగా చేసుకోవడం జరిగిందని పేర్కొన్న ఆయన,  కొత్త వ్యవస్థ విశ్లేషణ, అమలుకు తగిన డేటా పాయింట్లను ఈ లావాదేవీలు అందిస్తాయన్న భరోసాను ఇచ్చారు. ఇదిలావుండగా కార్యక్రమంలో  ఫిన్‌టెక్‌ కన్వర్జెన్స్‌ కౌన్సిల్‌ కో–ఛైర్మన్‌ శ్రీనివాస్‌ జైన్‌ మాట్లాడుతూ, వీలైనంత త్వరగా ఒక స్వయం రెగ్యులేటరీ వ్యవస్థను రూపొందించుకోడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement