దేశీయ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రధాన మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియంల రోజువారీ డాలర్ అవసరాలను అక్టోబర్ 12 నుంచి నేరుగా తామే తీర్చనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. గత శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.96.74 వద్ద రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోయిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ చర్యలు చేపట్టింది.
మార్కెట్‌లో డాలర్ల డిమాండ్‌కు చెక్
భారతదేశం తన ముడిచమురు అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఆగస్టు గణాంకాల ప్రకారం దేశం నెలకు 2.3 కోట్ల టన్నుల చమురును దిగుమతి చేసుకుంటోంది. దీని విలువ సుమారు 11.7 బిలియన్ డాలర్లు (రోజుకు 377 మిలియన్ డాలర్లు). ఇందులో ఈ మూడు ప్రభుత్వ రంగ సంస్థల వాటానే దాదాపు 55 శాతంగా ఉంది.
సాధారణంగా ఈ సంస్థలు చమురు దిగుమతుల చెల్లింపుల కోసం స్పాట్ మార్కెట్‌పై ఆధారపడి డాలర్లను కొనుగోలు చేస్తుంటాయి. ఆగస్టు డేటా ఆధారంగా ఈ సంస్థలకు రోజుకు సుమారు 200 మిలియన్ డాలర్లు విదేశీ మారకద్రవ్యం అవసరమవుతుంది. రష్యా నుంచి కొనుగోలు చేసే చమురుకు యూఏఈ దిర్హామ్‌లు లేదా రూపాయల్లో చెల్లింపులు జరుపుతున్నప్పటికీ నేరుగా డాలర్ల రూపంలో చెల్లించాల్సిన నిధులు రోజుకు కనీసం 114 మిలియన్ డాలర్లుగా ఉంటాయి.
ప్రత్యేక విండో ద్వారా విక్రయాలు
ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విండో కింద సదరు ఆయిల్ సంస్థలు స్పాట్ మార్కెట్‌లో పోటీపడి డాలర్లు కొనాల్సిన అవసరం ఉండదు. వాటికి కేటాయించిన ప్రత్యేక బ్యాంకుల ద్వారా ప్రస్తుత మార్కెట్ ధరలకే ఆర్‌బీఐ నేరుగా డాలర్లను ఈ కంపెనీలకు విక్రయిస్తుంది. దీనివల్ల ఓపెన్ మార్కెట్ నుంచి రోజువారీ డాలర్ డిమాండ్ తగ్గుతుంది. ఫలితంగా మారకద్రవ్య మార్కెట్‌లో హెచ్చుతగ్గులు తగ్గి రూపాయి క్షీణతకు అడ్డుకట్ట పడుతుందని బ్యాంకింగ్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇదీ చదవండి: పండగ ఆఫర్లు.. ఆన్‌లైన్ షాపింగ్.. బీ అలర్ట్!


