నేటి నుంచి ఆర్‌బీఐ పాలసీ సమీక్ష | RBI Policy Review June 2026 Repo Rate Pause Inflation Risks Forecasts | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఆర్‌బీఐ పాలసీ సమీక్ష

Jun 3 2026 1:31 PM | Updated on Jun 3 2026 1:34 PM

RBI Policy Review June 2026 Repo Rate Pause Inflation Risks Forecasts

నేటి నుంచి ఆర్‌బీఐ గవర్నర్‌ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. మూడు రోజులపాటు నిర్వహించనున్న సమావేశాల్లో భాగంగా శుక్రవారం(5న) పాలసీ నిర్ణయాలు ప్రకటించనుంది. అయితే అత్యధిక శాతం మంది ఆర్థికవేత్తలు, ట్రెజరీ నిపుణులు ఈసారి యథాతథ పాలసీ అమలుకే ఎంపీసీ కట్టుబడవచ్చని అంచనా వేస్తున్నారు. వెరసి వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 5.25 శాతం వద్దే కొనసాగించే వీలున్నట్లు భావిస్తున్నారు.

మరోపక్క ద్రవ్యోల్బణ రిస్క్‌లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) చివర్లో కేంద్ర బ్యాంకు(ఆర్‌బీఐ) కఠిన పరపతి విధానాలకు తెరతీసే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. పాలసీ సమీక్షపై పీటీఐ వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో 11 మంది స్టేటస్‌ కోకు వీలున్నట్లు పేర్కొనగా.. నలుగురు మాత్రం 0.25% రెపో రేటు పెంపును అంచనా వేశారు.

4 శాతానికి దిగువనే..

ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యమైన 4 శాతం దిగువనే కొనసాగుతుండటంతో రేట్ల పాజ్‌ను చేపట్టవచ్చని ఆర్థికవేత్తలు, ట్రెజరీ నిపుణులు పేర్కొన్నారు. ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని పరిశీలించేందుకు ఆర్‌బీఐ మరికొంతకాలం వేచిచూసేందుకు అవకాశమున్నదని ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ ఎకానమిస్ట్‌ గౌర సేన్‌గుప్తా అభిప్రాయపడ్డారు. గతేడాది వృద్ధికి మద్దతుగా ఎంపీసీ రెపో రేటులో మొత్తం 1.25 శాతం కోత పెట్టిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: ఏఐ సామ్రాజ్యంపై భారత్‌కు హక్కు దక్కేనా?

Advertisement
 
Advertisement
Advertisement