RBI Bulletin: వృద్ధి నెమ్మదించదు..

RBI Bulletin: Unlike Global Economy, India Would Not Slow Down - Sakshi

 ఆర్‌బీఐ బులెటిన్‌

ముంబై: ఆర్థిక మాంద్యం అంచున ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, భారత్‌ ఎకానమీ మందగించదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బులెటిన్‌లో ప్రచురించిన ఒక ఆర్టికల్‌ స్పష్టం చేసింది.  భారత్‌లో పలు రంగాలు 2022–23 ఆర్థిక సంవత్సరంలో మంచి ఫలితాలను సాధించాయని పేర్కొన్న ఆర్టికల్, ఇదే మంచి ఫలితాలు మున్ముందూ కొనసాగుతాయన్న ధీమాను వ్యక్తం చేసింది. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం రచించిన ఈ కథనంలోని అభిప్రాయాలు ఆర్‌బీఐగా పరిగణించడానికి వీలు లేదని కూడా బులెటిన్‌ పేర్కొనడం గమనార్హం.  

గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్ల అనిశ్చితి కారణంగా 2023లో ప్రపంచ వృద్ధి మందగించడానికి లేదా మాంద్యంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ, భారత్‌ ఎకానమీ పటిష్టంగా కొనసాగుతుంది.   ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం నుండి స్థిరమైన వృద్ధి ధోరణి ఊపందుకోవడం దీనికి కారణం.  తొలి అంచనాలకన్నా  ఎకానమీ వృద్ధి బాటన పయనిస్తోంది. మహమ్మారి తీవ్రత నుంచి సమర్థవంతమైన రీతిలో బయట
పడింది.  
ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల్లో మనం ఫలితాలను వార్షికంగా సమీక్షించుకుంటే వృద్ధి ధోరణి కనబడదు. బేస్‌ ఎఫెక్ట్‌ ఇక్కడ ప్రధానంగా శాసిస్తుంది. త్రైమాసికంగా ఈ మదింపు జరపాల్సి ఉంటుంది.  
కొత్త వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం (ఎస్‌టీఏఆర్‌టీ) నుండి రష్యా తన భాగస్వామ్యాన్ని సస్పెండ్‌ చేయడం, వడ్డీరేట్లకు సంబంధించి కఠిన వైఖరి కొనసాగుతుందని అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) నుంచి వచ్చిన సంకేతాలు, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ భారీ పెరుగుదల వంటి అంశాలు భారత్‌ మార్కెట్ల సానుకూల వైఖరిని ఫిబ్రవరి 2023 ద్వితీయార్థంలో తగ్గించాయి. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఫిబ్రవరిలో తన తొలి లాభాలను వదులుకొని మొత్తంగా ఒక శాతం క్షీణించింది. మార్చి తొలినాళ్లలో తిరిగి కొంత కోలుకుంది. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండడం దీనికి ఒక కారణం. అయితే అంతర్జాతీయ బ్యాంకింగ్‌ సంక్షోభ వాతావరణం దేశీయ ఈక్విటీలపై తిరిగి ప్రతికూల ప్రభావం చూపిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top