రైల్‌ షేర్ల పరుగు కొనసాగేనా?

Rail stocks may chug along till Budget; book profit selectively - Sakshi

ఏడాది కాలంగా దూకుడు

గరిష్టాలకు చేరిన పలు షేర్లు

ఇటీవల స్వల్ప వెనకడుగు

బడ్జెట్‌పై అంచనాలతో జోష్‌

ఏడాది కాలంగా రైల్వే రంగ కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నాయి. ఈ బాటలో అత్యధిక శాతం షేర్లు గత రెండు నెలల్లో 52 వారాల గరిష్టాలకు చేరాయి. మరికొన్ని స్టాక్స్‌ 2022 జనవరిలో నమోదైన గరిష్టాల నుంచి కొంతమేర వెనకడుగు వేసినప్పటికీ పటిష్టంగా ట్రేడవుతున్నాయి. ఇందుకు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న సార్వత్రిక బడ్జెట్‌పై అంచనాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇతర వివరాలు చూద్దాం..

 రైల్వే స్టాక్స్‌లో కొనసాగుతున్న బుల్‌ రన్‌కు కొద్ది రోజుల్లో బ్రేకులు పడవచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ఏడాది కాలంగా పలు కౌంటర్లు ర్యాలీ బాటలో సాగుతుండటంవల్ల లాభాల స్వీకరణకు చాన్స్‌ ఉన్నట్లు భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌పై సానుకూల అంచనాలు రైల్వే రంగ కంపెనీలకు జోష్‌నిస్తున్నట్లు తెలియజేశారు. బడ్జెట్‌ ప్రకటనకు ఇక 30–40 రోజులు మాత్రమే మిగిలిఉన్న నేపథ్యంలో రైల్వే కౌంటర్లలో యాక్టివిటీ తిరిగి ఊపందుకోనున్నట్లు పేర్కొన్నారు. అయితే నిజానికి రైల్‌ షేర్లలో సంస్థాగత ఇ న్వె­స్టర్ల పెట్టుబడులు తక్కువగా ఉండటంతో ర్యా లీలో నిలకడ లోపించవచ్చని అభిప్రాయపడ్డారు. అధిక ధరల వద్ద ర్యాలీ కొనసాగేందుకు సంస్థాగత ఇన్వెస్టర్ల ఆసక్తి కీలకమని తెలియజేశారు. వెరసి 2023–24 బడ్జెట్‌ వెలువడిన తదుపరి రైల్‌ షేర్లలో దిద్దుబాటు(కరెక్షన్‌)కు వీలున్నట్లు పేర్కొంటున్నా రు.

లాభాల పరుగు
రైల్వే సంబంధ కౌంటర్లలో ఆర్‌వీఎన్‌ఎల్, టెక్స్‌మాకో రైల్‌ అండ్‌ ఇంజినీరింగ్, ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్, రైట్స్‌ లిమిటెడ్, ఐఆర్‌ఎఫ్‌సీ, టిటాగఢ్‌ వేగన్స్, ఇర్కాన్‌ ఇంటర్నేషనల్, రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఏడాది కాలంగా ర్యాలీ వచ్చింది. ఈ కౌంటర్లు సుమారు 120–100 శాతం మధ్య దూసుకెళ్లాయి. ఇందుకు కొద్ది నెలలుగా రైల్వేలపై ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలు పెరగడం, షేర్లు అందుబాటు ధరలో లభిస్తుండటం, అధిక డివిడెండ్లు వంటి అంశాలు దోహదపడ్డాయి. చాలా కౌంటర్లు 10 పీఈ స్థాయిలో కదులుతుండటంతో ట్రేడర్లు ఆసక్తి చూపినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీనికితోడు 3–4 శాతం డివిడెండ్‌ ఈల్డ్‌ ఆకర్షణను పెంచినట్లు తెలియజేశారు. ఫలితంగా డిఫెన్స్‌ రంగ స్టాక్స్‌లో ర్యాలీ తదుపరి రైల్వే రంగ కౌంటర్లలోకి ఇన్వెస్టర్ల చూపు మరలినట్లు విశ్లేషించారు.

38 శాతంతో జోష్‌
గత బడ్జెట్‌(2022–23)లో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి వ్యయాల్లో విలువరీత్యా  రైల్వే ప్రాజెక్టులకు 38 శాతం కేటాయింపులు చేపట్టడం ర్యాలీకి సహకరించినట్లు నిపుణులు తెలియజేశారు. 2019–20లో 43 శాతం కేటాయింపులను పొందిన రీతిలో రైల్వేకు మళ్లీ ప్రాధాన్యత ఏర్పడటం ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నట్లు వివరించారు. ఈసారి రానున్న బడ్జెట్‌లో రైల్వేలు స్థూలంగా రూ. 1.5–1.8 లక్షల కోట్ల బడ్జెటరీ మద్దతును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. గత బడ్జెట్‌లో ఇది రూ. 1.37 లక్షల కోట్లుగా నమోదైంది. కొత్తగా 300–400 వందే భారత్‌ రైళ్లకు తెరలేవనున్న అంచనాలతో ఈసారి రికార్డ్‌ బడ్జెటరీ మద్దతు లభించవచ్చని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. రానున్న 20–25 ఏళ్లలో కొత్తగా లక్ష కిలోమీటర్ల ట్రాక్‌లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా కొత్త లైన్లకూ కేటాయింపులు పెరగవచ్చని భావిస్తున్నాయి. వెరసి ఈ ప్రణాళికల కారణంగా రైల్వే సరఫరాదారులు, ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలకు భారీ ఆర్డర్లు లభించవచ్చని పేర్కొంటున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top