హైదరాబాద్‌: ఫుల్‌ డిమాండ్‌.. అందులో స్టార్టప్‌ల ఏర్పాటు కోసం ఎగబడుతున్న సంస్థలు!

Raidurgam It Corridor Thub: Companies Showing Interest Startups Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాయదుర్గంలో ఐటీ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంకుర పరిశ్రమల స్వర్గధామం టీహబ్‌– 2లో స్టార్టప్‌లు నెలకొల్పేందుకు తాజాగా వంద వరకు దేశ, విదేశీ సంస్థలు క్యూ కట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే సుమారు 200 అంకుర సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించిన విషయం విదితమే.

వీటిలో ఐటీ, అనుంబంధ రంగాలు,కృత్రిమ మేథ,సైబర్‌సెక్యూరిటీ తదితర రంగాలతో పాటు ఆరోగ్య, ప్రజోపయోగ సేవలందించేందుకు నూతన ఆవిష్కరణలు చేసే సంస్థలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌ నెలలో ఐటీ శాఖ ఈహబ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. సుమారు రూ.276 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రంలో దశలవారీగా దాదాపు రెండువేల కంపెనీలకు వసతి కల్పించనున్నారు.
 

స్టార్టప్‌లకు కేరాఫ్‌..
► టీహబ్‌– 2 కేంద్రాన్ని రాయదుర్గంలో 3.5 లక్షల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో నిర్మించారు. దేశంలోనే ఇది అతిపెద్ద ఇంక్యుబేటర్‌ కేంద్రమని.. ప్రపంచంలోనే రెండోదని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టీ హబ్‌ మొదటి దశను ఐఐఐటీ హైదరాబాద్, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్, నల్సార్‌ సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి. ఇందులో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గచ్చిబౌలిలోని ఐఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో నెలకొల్పారు.  
► స్టార్టప్‌ కంపెనీలు నెలకొల్పాలనుకునే ఔత్సాహికులు, వారికి పెట్టుబడి సాయం అందించే ఇన్వెస్టర్లు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలను ఒకే చోటకు చేర్చడం హబ్‌ ఉద్దేశం. అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉన్న అవకాశాలను ఒడిసిపట్టుకునేదుకు అనువైన వ్యవస్థను టీహబ్‌లలో ఏర్పాటు చేయడం విశేషం. 

తొలిదశ సూపర్‌హిట్‌.. 
► స్టార్టప్‌ కంపెనీలను ప్రోత్సహించేందుకు గచ్చిబౌలిలో 2015లో ఏర్పాటు చేసిన తొలి టీహబ్‌ ప్రయోగం విజయవంతమైంది. హబ్‌లో గత ఏడేళ్లుగా 1200 స్టార్టప్‌ కంపెనీలు పురుడు పోసుకున్నాయి. సుమారు రూ.1800 కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. సుమారు 2500 మందికి ఉపాధి కల్పించింది. ఇక్కడ పురుడు పోసుకున్న పలు స్టార్టప్‌లు దేశ, విదేశాల్లో పని చేస్తున్న ఐటీ, బీపీఓ, కేపీఓ, సేవ, బీమా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్, ఇండస్ట్రీ రంగాల్లో సేవలందిస్తోన్న కంపెనీలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయి.
 
► ఈ హబ్‌ను మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్‌ సిస్టమ్స్‌ సీఈఓ శంతను నారాయణ్, బయోకాన్‌ చైర్మన్‌ కిరణ్‌ మంజుందార్‌షాలు సందర్శించి.. ఇక్కడ స్టార్టప్‌లను నెలకొల్పిన యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించారు. ఈ హబ్‌లో స్టార్టప్‌ ఇన్నోవేషన్, కార్పొరేట్‌ ఇన్నోవేషన్, డెమోడే, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ తదితర అంశాలపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవగాహన కల్పిస్తున్న విషయం విదితమే. 

ఐటీ బూమ్‌కు దోహదం.. 
టీహబ్‌ ఒకటి, రెండో దశలకు స్పందన క్రమంగా పెరుగుతుండడంతో నగరంలో ఐటీ రంగంలో మరిన్ని నూతన స్టార్టప్‌లు పురుడు పోసుకునే అవకాశాలుంటాయని హైసియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐటీ రంగం మరింత వృద్ధి సాధించేందుకు ఈ హబ్‌లు దోహదం చేస్తాయని పేర్కొన్నాయి.

చదవండి: ‘రేపట్నించి ఆఫీస్‌కు రావొద్దు’, అర్ధరాత్రి ఉద్యోగులకు ఊహించని షాక్‌..భారీ ఎత్తున తొలగింపు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top